Munugode election congress, bjp focus: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత ఉద్ధృతం చేయనుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. ప్రధానంగా నియోజక వర్గంలోని మొత్తం బూతులను ఒక్కో క్టస్టర్ పరిధిలోకి పదేసి లెక్కన 30 వరకు విభజన చేశారు. బూతు స్థాయిలో సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతోపాటు క్లస్టర్ స్థాయిలో ఇంఛార్జిలను, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్‌మెంట్ ఇంచార్జిలను నియమించారు. వీరు కాకుండా మండలాలకు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్ నాయకులు ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు.
వీరంతా కూడా రేపటి నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే 5 మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది. పాల్వాయి స్రవంతి తరఫున ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్లు వేస్తారు. ఆ తరువాత 14న భారీ జనసమీకరణతో మరొకసారి నామినేషన్లు వేయనున్నారు.