Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు మరో 20 రోజులే మిగిలి ఉండటంతో... గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గ బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపపోరు... అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, భాజపాలు కీలకంగా భావిస్తున్నందున సత్తాచాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... ఉపఎన్నికకు కారణమైన భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఈ ఉపఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇప్పటికే గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న రాజగోపాల్‌రెడ్డి... నిన్న భారీ జనసమీకరణతో చండూరులో నామినేషన్ వేశారు. బంగారుగడ్డ నుంచి... భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన చండూరు రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. బండి సంజయ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, ఈటల, రఘునందనరావుతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. అధికారంలో ఉన్న తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... మునుగోడులో భాజపా విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి తొలి నుంచి కాంట్రాక్టర్ అని... కేసీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తెరాస... రాజగోపాల్ రెడ్డి వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల దాహంతోనే ఉపఎన్నిక వచ్చిందనే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఉపఎన్నికను మునుగోడు ప్రజల ఆత్మగౌరవం, రాజగోపాల్ రెడ్డి అహానికి మధ్య పోటీగా పేర్కొన్న మంత్రి కేటీఆర్... ఎమ్మెల్యేగా రాజగోపాల్ వైఫల్యాలు, కాంట్రాక్టులను వివరిస్తూనే... ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. మునుగోడు అభ్యర్థి ప్రకటన తర్వాత తొలి ప్రచార కార్యక్రమాన్ని మునుగోడు మండలం కొరటికల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు. అభ్యర్థి కూసుకుంట్ల, వామపక్ష నేతలతో కలిసి పర్యటించిన మంత్రి... రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన 18 వేల కోట్లను... నల్గొండ జిల్లాకు, మునుగోడు అభివృద్ధికి ఇస్తే ఉపఎన్నిక నుంచి తెరాస తప్పుకుంటుందని సవాల్ విసిరారు.