ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Munugode Bypoll: మునుగోడులో హోరాహోరీ ప్రచారం.. ఏ ఒక్కరూ తగ్గట్లేదుగా!

Munugode by election: మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల ఘట్టం ముగియటంతో ప్రచారంతో హోరెత్తించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులు మాత్రమే గడువు ఉండటంతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థులు పోటాపోటీగా  ప్రచారం సాగిస్తుండగా రోడ్‌షోలు, ర్యాలీలతో ముఖ్యనేతలు ఊళ్లను చుట్టేస్తున్నారు.

Munugode
మునుగోడు ఉపఎన్నిక

By

Published : Oct 15, 2022, 11:58 AM IST

Munugode by election: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు నామినేషన్లు, అభ్యర్థుల ప్రచారాలతో సాగిన ఉపపోరు.. ఇక ముఖ్య నేతల పర్యటనలు, బహిరంగసభలతో మరింత వేడెక్కనుంది. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని పార్టీలు భావిస్తున్నాయి.

తెరాస ఎన్నికల వ్యూహం..ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచే కార్యక్షేత్రంలో నిమగ్నమైన అధికార తెరాస.. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను ఊరూరా మోహరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి.. పార్టీ అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డిగూడెం, గుజ్జ, అల్లందేవ్‌చెరువు గ్రామాలకు వెళ్లి.. ఓట్లు అభ్యర్థించారు. నాంపల్లి మండలం రాజ్యతండాలో ఎంపీ మాలోతు కవిత.. చల్లవానికుంటలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రచారం చేశారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థంతోనే ఈ ఉపఎన్నిక వచ్చిందన్న మల్లారెడ్డి.. ఆయన ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.

రాజగోపాల్​రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చింది. ఆయన ఓడిపోవడం ఖాయం. మునుగోడు అభివృద్ధికి కేంద్రం నుంచి 200 కోట్లు రూపాయలు అయిన తెగలవా.. నీ కాంట్రాక్టులను కాపాడుకోవడానికే ఈ ఉప ఎన్నిక తెచ్చావు. ఎక్కడ నుంచి నీకు ఇన్ని డబ్బులు వచ్చాయి. ఇంత లగ్జరీగా గడుపుతున్నావు కదా. -మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

కాంగ్రెస్​ నాయకత్వం.. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం మునుగోడు బాట పట్టింది. రాహుల్‌గాంధీ పాదయాత్ర కోసం ఏర్పాట్లలో నిమగ్నమైన ఆ పార్టీ నేతలు.. నిన్న పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ సందర్భంగా కదలొచ్చారు. చండూరులో రేవంత్‌రెడ్డి సమక్షంలో 2 సెట్ల నామినేషన్‌ పత్రాలను స్రవంతి సమర్పించారు. అంతకుముందు బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పాల్వాయి స్రవంతి.. నామినేషన్‌ కార్యక్రమంలో తన తండ్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు చారిత్రక అవసరమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి ధనదాహంతో కాంగ్రెస్‌ చంపేయాలని చూస్తున్నారని.. డబ్బు సంచులతో వస్తున్న భాజపా, తెరాస నేతల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

తెరాస, భాజపా పార్టీలు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టాలని అనుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలు ఎమ్మెల్యే చనిపోతే వచ్చినవి కావని...ఓ వ్యక్తి అమ్ముడు పోతే వచ్చిన ఎన్నిక. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ధన దాహంతో కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టి పార్టీని చంపేయాలని చూస్తున్నాడు. మునుగోడు ఎన్నికల్లో గెలిస్తే నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాలు, నియోజక వర్గాల పరిస్థితి ఏమిటో చెప్పాలి. తెరాస వలలో మునుగోడు ప్రజలు పడొద్దు. స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క, సారక్కల్లా సీతక్కతో కలిసి అసెంబ్లీలో కొట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి డిండి ప్రాజెక్టు కోసం 5వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు ఇప్పించగలడా. ఓ ఆడిబిడ్డను ఓడించేందుకుందుకు భాజపా, తెరాసలు ఇంత మందిని ఉపయోగించాలా?- రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇటు భాజపా హోరు.. మరోవైపు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ఊరూరా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రాజగోపాల్‌ గెలుపే లక్ష్యంగా కమలదళం నేటి నుంచి కదనరంగంలోకి దూకనుంది. ఇవాళ ఒక్క రోజే 14 సభలు నిర్వహించేందుకు భాజపా నాయకత్వం సిద్ధమైంది. నేడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చౌటుప్పల్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే మండలంలోని పలుగ్రామాల్లో ఈటల రాజేందర్‌ ప్రచారానికి వెళ్లనుండగా.... మర్రిగూడ మండలంలో రఘునందన్‌రావు, నాంపల్లిలో బాబూమోహన్‌ పర్యటించనున్నారు. ఈనెల 18 నుంచి బండి సంజయ్‌ రంగంలోకి దిగనున్నారు. ఈ 15రోజుల పాటు వరుసగా సభలు, రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్న భాజపా... పార్టీ జాతీయ నేతలను సైతం ప్రచారానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..ఉపఎన్నిక నామినేషన్లకు నిన్న చివరి రోజు కావటంతో పెద్దఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి. కాంగ్రెస్, తెజస అభ్యర్థులతోపాటు ఒకే రోజు 85వరకు నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చండూరులోనామినేషన్‌ వేశారు. గద్దర్‌ను భయభ్రాంతులకు గురిచేయటంతో తానే నామినేషన్‌ వేసినట్లు పాల్‌ తెలిపారు. డిండి ఎత్తిపోతల నిర్వాసితులు, రాష్ట్రంలోని ప్రజా, కులసంఘాల నేతలు, ఓయూకు చెందిన నిరుద్యోగులు మునుగోడు బరిలోకి దిగేందుకు నామినేషన్లతో రావటంతో అర్ధరాత్రి వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ప్రక్రియ కొనసాగింది. ఉపఎన్నికలో మొత్తం 140 వరకు నామినేషన్లు అందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details