ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త - municipal workers protest in andhra pradesh

MUNICIPAL WORKERS PROTEST: సంవత్సరాలుగా పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. పలు జిల్లాల్లో విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వీరికి పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

MUNICIPAL WORKERS PROTEST
MUNICIPAL WORKERS PROTEST

By

Published : Jul 11, 2022, 12:49 PM IST

Updated : Jul 11, 2022, 3:00 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

MUNICIPAL WORKERS PROTEST: రాష్ట్రంలో మున్సిపల్​ కార్మికులు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ పలు చోట్ల నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.

తిరుపతి:జిల్లాలోని నగరపాలిక కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు.. బైఠాయించి నిరసన తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విధులు బహిష్కరించి.. సమ్మెకు దిగడంతో తిరుపతిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది.

నంద్యాల:జిల్లాలో పురపాలిక ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు.. విధులు బహిష్కరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస సెంటర్‌లో ఆందోళన చేశారు.

శ్రీకాకుళం: జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టి.. విధులను బహిష్కరించారు. ఏడు రోడ్ల కూడలిలో నిరసన, ధర్నా చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు.. సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.

వైఎస్సార్​: జిల్లాలో మున్సిపల్​ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులతో కమిషనర్ సాయి ప్రవీణ్ చర్చలు జరుపుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని.. కరోనా సమయంలో ఎంతోమంది మున్సిపల్ కార్మికులు ప్రాణాలు వదిలారని వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

*మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని... సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మె సైరన్‌ లో భాగంగా... కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరసనలో కార్మిక సంఘాలతో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన కనీసవేతనం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. హెల్త్ అలవెన్స్ కింద 6 వేల రూపాయలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు

విజయనగరం: మున్సిపల్ కార్మికులకి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలను తెల్లవారుజామున 6 గంటల నుంచి నిలుపుదల చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని చెత్త తరలింపు వాహన చోదకులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతున్న తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కార్మికుల వాపోయారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని.. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీ అయిన స్థానంలో కొత్తవారిని నియమించకుండా తమపై పని భారం పెంచుతున్నారంటూ ఆరోపించారు.

ఎన్టీఆర్​ జిల్లా నందిగామ మున్సిపల్ సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ నాయకులు తెలిపారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు 9 నెలల హెల్త్ అలెవెన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల్లో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తించడం లేదని... కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఏఐటీయూసీ సీఐటీయూ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మిక భత్యాలను ఇవ్వాలని, పీఆర్సీ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతానని హామీ.. అలాగే మిగిలిందన్నారు. కార్మికులకు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో మున్సిపల్​ కార్మికులు సమ్మె బాట పట్టారు. మదనపల్లె పురపాలక సంఘంలో పనిచేసే 160 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. సోమవారం ఉదయం నుంచే విధులకు హాజరు కాకుండా పురపాలక సంఘం కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు.

విశాఖ: కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పారిశుద్ధ్య సేవలు అందించిన కార్మికులకు.. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో పారిశుద్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు మాదిరి తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 11, 2022, 3:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details