తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులతో శుక్రవారం భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి ఇతర అంశాలపై చర్చించనున్నారు. తెరాస జాబితాలో అధికశాతం ప్రస్తుత కార్పొరేటర్లు కాగా.. పలువురు కొత్త అభ్యర్థులున్నారు. వారందరి పరిచయంతో పాటు వ్యక్తిగతంగా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. వారి మనోభావాలు, రాజకీయ సంకల్పం, ఇతర అంశాలను తెలుసుకుంటారు. ఈసారి ఎన్నికలను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున గెలుపు అవసరంతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో సమన్వయం, విస్తృత ప్రచారం, ఇన్‌ఛార్జులతో కలిసి నడవడం వంటి అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
శనివారం కుత్బుల్లాపూర్ నుంచి కేటీఆర్ ప్రచారం
అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుండటంతో మంత్రి కేటీఆర్ శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పక్కనే ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గంలోనూ ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. నగరంలోని 100 డివిజన్ల పరిధిలో 29 వరకు రోడ్‌షోలు జరుగనున్నాయి.