పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్డుల్లో ప్రచారానికి వచ్చారు.
రంగంలోకి ప్రజాప్రతినిధులు...
అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కల్యాణదుర్గంలో ఓట్లు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. 18వ వార్డులో వైకాపా అభ్యర్థి ప్రజల కాళ్లకు దండం పెట్టి ఓట్లు అభ్యర్థించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎమ్మెల్యే రోజా.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ.. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. కడప, ప్రకాశం జిల్లాల్లో వైకాపా, భాజపా నాయకులు నువ్వానేనా అన్నట్లు ప్రచారాలు చేశారు. చీరాలలో వైకాపా తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు.
విమర్శనాస్త్రాలు...
నవరత్నాలకు ఓట్లు పడతాయని నమ్మకం లేకే... వైకాపా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బెదిరింపు రాజకీయాలు చేస్తోందని .. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు.. తెనాలి ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు.