ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పన్ను, పన్నేతర ఆదాయం వసూళ్లు వందశాతం వసూలు చేయాలని.. తెలంగాణ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లను.. ఆ రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. మార్చి 31 వరకు నూరుశాతం వసూళ్లు ఉండేలా పనిచేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు పన్ను, పన్నేతర ఆదాయం వందశాతం వసూలు కావల్సిందేనని... అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.
లక్ష్యాన్ని అందుకోవడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రతి సోమ, బుధ, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ విధిగా పన్ను వసూలు మేళాలు నిర్వహించాలని సూచించింది. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. వసూళ్లలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.