ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపద ఎక్కడుంటే.. తస్లీమా అక్కడుంటుంది - mulugu sub Registrar thasleema

ఆకలితో ఉన్న వాళ్లకు అన్నంపెట్టి.. అమ్మైంది. పేద విద్యార్థులు చదువుకోవడానికి సాయంచేసి పెద్దక్కలా అండగా నిలిచింది. ఇంటిపెద్ద చనిపోతే దహన సంస్కారాలు చేసి.. ఆ ఇంటికే పెద్ద దిక్కయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరం, ఆపద ఎక్కడ ఉంటే తస్లీమా అక్కడ ఉంటారు.తెలంగాణ ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న తస్లీమా ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి అండగా నిలిచి అందరి చేత శెభాష్‌ అనిపించుకుంటున్నారు.

mulugu sub Registrar thasleema Supporting the poor
ములుగు సబ్‌ రిజిస్ట్రార్ తస్లీమాపై కథనం

By

Published : May 9, 2020, 8:32 AM IST

తెలంగాణ సిద్దిపేట నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లడానికి సుమారు ఓ 10 వలస కుటుంబాలు కాలినడకన బయలుదేరాయి. దారితప్పి వాళ్లంతా ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పాపం అప్పటికే 140 కిలోమీటర్ల దూరం అదనంగా నడిచారు.

ఇక ఆకలి మంటతో అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. స్థానికుడొకరు వాళ్ల అవస్థ చూసి ‘తస్లీమా మేడమ్‌ అని ఉంటారు. ఆమెను కలవండి’ అని చెప్పి వెళ్లిపోయాడా వ్యక్తి. వాళ్లు అదే పనిచేశారు. వాళ్లను చూసిన ఆమె ముందుగా వాళ్లందరికీ స్వయంగా వంట చేసి వాళ్ల ఆకలి తీర్చారు. తర్వాత కావాల్సిన సరకులు ఇచ్చి సాగనంపారు.

మామూలుగానే సేవకు సై అనే తస్లీమాకు ఈ లాక్‌డౌన్‌లో మరీ తీరిక లేకుండా పోయింది. మొన్న ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామానికి ఎర్రటి ఎండలో 20 కిలోమీటర్ల కాలినడక వెళ్లి అక్కడి వాళ్లకు కావాల్సిన దుస్తులు, నిత్యావసర సరకులు అందజేశారు.

జిల్లాలోని కేశవపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడని విన్న తస్లీమా ఇద్దరు చిన్నారులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడి భార్యని కలిసి ధైర్యం చెప్పి దహన సంస్కారాలు చేశారు. ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సాయాన్నీ అందించారు.

12 ఏళ్ల సేవా ప్రస్థానం..

ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం తస్లీమా సొంతూరు. ఆమె రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. సోదరుడి స్ఫూర్తితో 2009లో గ్రూప్‌-1కు ఎంపికై సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించారు. పన్నెండేళ్లుగా అటు ఉద్యోగం ఇటు సేవ రెండూ సమన్వయం చేస్తున్నారామె. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూసేకరణ సమయంలో మహదేవ్‌పూర్‌, కాటారం మండలాల్లోని వేల ఎకరాలకు భూ రిజిస్ట్రేషన్లు చేసి అధికారుల మెప్పుపొందారు. ఓ వైపు సమర్థమైన అధికారిగా పనిచేస్తూనే.. మరోవైపు సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు.

నాలుగేళ్ల కిందట జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ పరిసరాల్లో మతిస్థిమితం లేని యువతి కనిపించిందామెకు. గర్భం దాల్చిన ఆమెను చూసి చలించి చేరదీసి.. హన్మకొండ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ యువతికి పుట్టిన బాబును శిశు సంక్షేమ శాఖవారికి అప్పగించారు. ఇప్పటికీ ఆ బాబు పుట్టిన రోజును చేస్తుంటారు తస్లీమా. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఎంతోమందికి ఆమె అండగా నిలిచారు.

జయశంకర్‌ జిల్లాలోని అన్వేష్‌ అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతుంటే అప్పటి సబ్‌ కలెక్టర్‌ గౌతంతో కలిసి ఆ బాధ్యతను తీసుకుని దిల్లీలోని ఓ విశ్వవిద్యాలయంలో చదివిస్తున్నారు. వ్యవసాయంపై మక్కువతో సొంతూరులో సాగు మొదలుపెట్టి... కూలీలతో కలిసి స్వయంగా పొలం పనులు చేస్తారు. రెండేళ్ల కిందట తండ్రి పేరుతో సర్వర్‌ ట్రస్టును ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేశారు తస్లీమా.

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు ఉంటారు. 2010 నుంచే ఆ గూడేల వారికి సాయం అందిస్తున్నారు.

ఇదీచూడండి:హానికారక పరిశ్రమలు ఊరికి దూరంగా : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details