తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అత్యంత ఎత్తుకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి గోదావరి నీటిని తరలించి అక్కడ్నుంచి మిడ్ మానేర్ మీదుగా ఇటీవల ప్రారంభించిన రంగనాయక్ సాగర్‌కు జలాలు తరలించారు. అనంతరం 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మలన్నసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.
15 టీఎంసీలతో కొండపోచమ్మ!
ఈ ప్రాజెక్టుకుపై భాగంలో సుమారు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ ప్రాజెక్టును నిర్మించారు. రూ.1772 కోట్ల వ్యయంతో నిర్మించిన జలాశయంలో 4600 ఎకరాల భూమిని సేకరించారు. 4 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 15.8 కిలోమీటర్ల మేర జలాశయం చుట్టూ కట్ట నిర్మించారు.
మేడిగడ్డ నుంచి..
మేడిగడ్డ వద్దనున్న లక్ష్మి ఆనకట్ట నుంచి మర్కూక్ పంప్‌హౌజ్ వరకు చేరుకునే జలాలు సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇక్కడ్నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకు తరలివస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తైన ఈ ప్రాంతానికి చేరిన జలాలు మిగతా జలాశయాలు, కాల్వలకు గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా వెళ్తాయి. అన్నారం, సుందిళ్ల, నందిమేడారం, గాయత్రి, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, అక్కారం, మర్కూక్ పంప్ హౌజ్ల్లోని పంపుల ద్వారా అంచెలంచెలుగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు.
గోదావరమ్మను ఒడిసిపట్టిన కొండపోచమ్మ!