ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!? - mro vijaya reddy murder case behind the history

ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ వివాదాలు.. కోర్టు కేసులు.. రెవెన్యూ అవినీతి.. ఇవన్నీ కలిసి ఓ ఘోరానికి దారి తీశాయి.. కనీవినీ ఎరుగని దారుణ ఉదంతానికి కారణమయ్యాయి. భూ వివాదం కారణంగా ఒక దుండగుడు ఓ మహిళా తహసీల్దారును ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు.

mro vijaya reddy murder case behind the history

By

Published : Nov 5, 2019, 8:58 PM IST

హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు విజయారెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడడం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కార్యాలయ డ్రైవర్‌, అటెండర్‌, మరో వ్యక్తి గాయాలపాలయ్యారు. నిందితుడికి సైతం మంటలంటుకుని గాయపడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ ఉదంతంపై మండిపడ్డాయి.

మాట్లాడాలని చెప్పి...

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తహసీల్దార్‌ సీహెచ్‌ విజయారెడ్డి(40) సోమవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో తన ఛాంబర్‌లో విధుల్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడాలంటూ ఇదే మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన కూర సురేష్‌.. ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. తహసీల్దారుతో మాట్లాడుతూనే తన వెంట తెచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆమెపై పోశాడు.

హాహాకారాలు చేస్తూ...

హఠాత్పరిణామంతో విజయారెడ్డి పెద్దగా కేకలు వేశారు. ఆమె అరుపులు విన్న డ్రైవర్‌ గురునాథం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అటెండర్‌ చంద్రయ్య తలుపులు తెరిచాడు. ఇదే సమయంలో విజయారెడ్డి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె జుట్టు పట్టుకుని సురేష్‌ గట్టిగా లాగడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. నిందితుడు వెంటనే ఆమెకు నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మంటల్లో కాలిపోతూ కాపాడాలంటూ వేడుకొంటూ తహసీల్దార్‌ హాహాకారాలు చేశారు. పైకి లేవలేని స్థితిలో కార్యాలయ తలుపు వద్దనే పడి సజీవ దహనమయ్యారు.

కాపాడేందుకు వెళ్లి...

ఈ క్రమంలో నిందితుడికీ మంటలు అంటుకున్నాయి. తహసీల్దారును కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్యకు సైతం మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి వారిని తోసేసి పరారయ్యాడు. మరోవైపు ఓ పనిపై కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లి గ్రామానికి చెందిన నారాయణ తహసీల్దారును కాపాడేందుకు యత్నించడంతో మంటలు అంటుకున్నాయి.

పరిగెత్తిన నిందితుడు..

నిందితుడు సురేష్‌ మంటల్లోనే కార్యాలయం నుంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. కార్యాలయం ముందు టీషర్టు, ప్యాంటు విప్పేసి మంటలను ఆర్పుకొన్నాడు. అండర్‌వేర్‌తో జాతీయ రహదారిపై పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ చేరుకుని కిందపడిపోయాడు. వెంటనే అతన్ని హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈలోపు పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిశీలించగా విజయ మృతి చెంది ఉన్నారు.

చిన్న గది... గడియ పెట్టడంతో...

తహసీల్దారు కార్యాలయం 3 అంతస్తుల అద్దె భవనంలో ఉంది. గదులన్నీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ మాదిరిగా ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయ గది మొదటి అంతస్తు చిన్నగదిలో ఉంది. గదులన్నీ చిన్నవిగా ఉండటం... నిర్మాణం కొత్తది కావడం.. హ్యాండ్‌లాక్‌ ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు.

సినిమాల్లో మాదిరిగా...

మొదట నిందితుడు పెట్రోల్‌ చల్లిన వెంటనే ఆమె తేరుకుని లేచి నిలబడేలోగా... పెట్రోల్‌ను గది నుంచి బయటకు పోసుకుంటూ మరో గదిలోనూ చల్లినట్లు భావిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా గది బయట వరకు పెట్రోలుపోసి నిప్పు పెట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. సోమవారం ఫిర్యాదుల రోజు కావడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అక్కడే పనిచేస్తున్న ఓ ఉద్యోగినికి బదిలీ కావడంతో సోమవారం మధ్యాహ్నం తహసీల్దారును కలిసి ఆర్డరు తీసుకున్నారు. ఆమె వెళ్లిన వెంటనే ఈ ఘోరం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన...

తహసీల్దార్‌ విజయారెడ్డి మృతదేహాన్ని కార్యాలయం నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించగా.. అంబులెన్స్‌ ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి కలెక్టర్‌ హరీష్‌, రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ఉద్యోగులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఉస్మానియాలో పోస్టుమార్టం...

విజయారెడ్డి మృతదేహానికి సోమవారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలోని శవాగారంలో పోస్టుమార్టం నిర్వహించారు. భారీభద్రత మధ్య ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం ఫ్రొఫెసర్‌ సుగత ఆధ్వర్యంలోని నిపుణుల బృందం 2 గంటల పాటు మరణోత్తర పరీక్ష నిర్వహించిన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details