తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో ఆ శాఖలో క్షేత్రస్థాయిలో మార్పులు జరగనున్నాయి. తహసీల్దారుకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మిగిలిన సమయం తహసీల్దారు సేవలు కొనసాగుతాయి. దీనిపై ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనిని బట్టే ఏ పనికి ప్రజలు ఎప్పుడు రావాలో నిర్ణయించుకోవాలని రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఇన్నాళ్లూ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలతో ప్రోటోకాల్ విధులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయి పర్యటనలకే పరిమితమయ్యేవారు. ఇప్పుడీ బాధ్యతలను పూర్తిగా డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం అప్పగిస్తోంది. ఏదైనా అత్యవసర సందర్భంలో మాత్రం హాజరుకావొచ్చని సూచించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలకు కూడా డిప్యూటీ తహసీల్దార్లే హాజరుకానున్నారు.
తహసీల్దార్లకు మరోసారి శిక్షణ
రిజిస్ట్రేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా 443 మంది తహసీల్దార్లకు 2018లో 10 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మూడు రోజులు రిజిస్ట్రేషన్ల విధానంతో పాటు చట్టాలు, సబ్‌రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులపై అవగాహన కల్పించారు. ఆరు రోజుల పాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మక శిక్షణ పొందారు. ఒకరోజు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులను తెలుసుకున్నారు. వారికి మరోసారి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ
మరోపక్క రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయ భూములను తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూములు, ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన అనంతరమే రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ పూర్తి కావాల్సి ఉంది.