చంపేస్తామన్నారు.. నామినేషన్లు చించేశారు
ప్రకాశం జిల్లాలో ప్రత్యర్థుల బెదిరింపుల కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన, వేశాక వెనక్కి తీసుకున్న పదిమంది తాము చేసిన ఫిర్యాదుపై రశీదు ఇవ్వనందుకు జడ్పీ సీఈవో కైలాసగిరీశ్వర్ కారును అడ్డుకొని నిరసనకు దిగారు. సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కనిగిరి, మార్కాపురం మండలాలకు చెందిన వీరంతా తొలుత కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ వీడియో సమావేశంలో ఉన్నందున సిబ్బంది సూచనపై జడ్పీ కార్యాలయంలో సీఈవోను కలిశారు. ఫిర్యాదులపై సీఈవో రశీదు ఇవ్వనందుకు ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఆవరణలో, గేటు బయట ఆయన కారును అడ్డుకున్నారు.
ప్రత్యర్థులు బెదిరించి భయపెట్టారని గుంటూరు జిల్లాలో 81 మంది నుంచి ఫిర్యాదులొచ్చాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి 70, పురపాలక ఎన్నికలపై మరో 11 ఫిర్యాదులు అధికారులకు అందాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలానికి చెందిన డి.సీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బాయమ్మ, జి.శ్రీనివాస్, రామ్‌సింగ్‌నాయక్ తమను అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పురపాలక పరిధిలో వార్డు స్థానాలకు సంబంధించి ప్రత్యర్థులు తమతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని అధికారుల ముందు పలువురు వాపోయారు.
ప్రత్యర్థులు భయపెట్టడంతో జడ్పీటీసీ స్థానానికి వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నామని చిత్తూరు జిల్లా చినగొట్టిగల్లు, రామచంద్రపురం, కార్వేటినగరం, పూతలపట్టు, కురబలకోట మండలాలకు చెందిన పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమను ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయనివ్వలేదని 31 మంది అధికారులను కలిసి వివరించారు. మరో అవకాశం కల్పిస్తే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు, కలువాయి, ఉదయగిరి, డక్కిలి, సీతారాంపురం, కావలి మండలాలకు చెందిన 36 మంది అధికారులను కలిసి.. తమను ఎంపీటీసీగా నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు భయపెట్టారని ఫిర్యాదుచేశారు. ప్రత్యర్థులు తనపై పోలీసు కేసులు పెడతామని బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని సీతారాంపురం జడ్పీటీసీ అభ్యర్థి జి.చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో వందమందికి పైగా కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదులు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకునేలా అధికార పార్టీ నాయకులు భయపెట్టారని ఆరోపించారు. ప్రత్యక్ష దాడులకు సైతం దిగారని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.