ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇరు వైపులా వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ప్రభుత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు తమను ఇంప్లీడ్ చేసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు.
అన్ని పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. జనసేన పార్టీ తరపున న్యాయవాది వేణుగోపాల రావు, ఎస్ఈసీ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈ యేడాది మే లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.
పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని.. వాటి భద్రతకు భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు.