విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఇప్పుడు మాట్లాడొద్దంటూ వైకాపా ఎంపీ బాలశౌరి మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు చేసిన సూచనలు కలకలం రేపాయి. శుక్రవారం దిల్లీలో వైకాపా ఎంపీలు విలేకర్లతో మాట్లాడటానికి సమాయత్తమయ్యారు. ఈ సమయంలో విశాఖ ఉక్కుపై ఏం మాట్లాడాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. మరో ఎంపీ బాలశౌరిని అడిగారు. ‘దానిపై పార్టీ విధానం తీసుకుంటుంది. ఇప్పుడేమీ మాట్లాడొద్దని’ ఆయన సూచించారు. ‘ఇంకేం మాట్లాడాలని మళ్లీ సుభాష్‌చంద్రబోస్ అడిగడంతో... ‘చెప్పండి మామూలువే ఉంటాయి కదా... చంద్రబాబు దివాళాకోరుతనంలాంటివి’ అని బాలశౌరి సూచించారు. వీరిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకున్న ఈ మాటలన్నీ టీవీల మైకుల్లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యాయి.
ఇప్పుడేమీ మాట్లాడొద్దు! మరి ఇంకేం మాట్లాడాలి?
దిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ , బాలశౌరి మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఎంపీలు మాట్లాడిన మాటలన్నీ టీవీల మైకుల్లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యాయి. వారి సంభాషణలపై తెదేపా నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేస్తూ వీటిని జత చేశారు. ‘విశాఖ ఉక్కు విక్రయం... జగన్ ఏపీకి చేసిన నమ్మక ద్రోహమేనని వైకాపా ఎంపీలే... జగన్‌రెడ్డి మీడియాలోనే చెబుతూ అడ్డంగా దొరికిపోయారు. ఉత్తరాంధ్ర ద్రోహులు జగన్, విజయసాయిలను ప్రజలు తరిమికొట్టకపోతే యారాడ కొండ, సముద్రం కూడా అమ్మేస్తారని’ ట్విటర్‌లో లోకేశ్ పేర్కొన్నారు. అనంతరం బాలశౌరి ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘నా మాటలను లోకేశ్ వక్రీకరించారు. విశాఖ ఉక్కుపై సీఎంను అడిగి మాట్లాడదాం అనడంలో తప్పు ఏముందని’ ప్రశ్నించారు.
ఇదీ చూడండి.పల్లె పోరు: కొనసాగుతున్న ఉద్రిక్తతలు..ఓ వర్గం అభ్యర్థులను బెదిరిస్తున్న ప్రత్యర్థి వర్గం