రాజ్యాంగంలో రాజధాని గురించి ఏ జాబితాలోనూ స్పష్టంగా చెప్పలేదు కాబట్టి ఆర్టికల్ 246, 248 ప్రకారం ఆ అధికార పరిధి పార్లమెంటుకే దక్కుతుందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఆ అధికారాన్ని అనుసరించే ఆనాటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 6 (రెడ్‌విత్ 94) ప్రకారం రాజధానిని నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించిందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్రం పాత్ర లేదనడం సరికాదని అన్నారు. ఇటీవల ఏపీ హైకోర్టులో కేంద్రహోంశాఖ దాఖలుచేసిన అఫిడవిట్లపై వినతిపత్రం సమర్పించారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఏవైనా చట్టాలు చేస్తే వాటిని రాష్ట్రపతికి పంపాలి తప్పితే గవర్నర్‌కు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంలో చేసిన చట్టాలు పార్లమెంట్ చేసిన విభజన చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతికి పంపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా అడుగులేయడమూ చట్ట ఉల్లంఘన కిందికే వస్తుంది’’ అని సుజనాచౌదరి హోంశాఖ కార్యదర్శికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.