"ఏపీలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి"
తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టులను సమీక్షిస్తూ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఎంపీ సుజనా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి వల్ల రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని.. ఇలాగైతే కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిచోటా న్యాయపోరాటం అంటే పనులు ఆలస్యం అవుతాయని దిల్లీలో మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. పోలవరం, రాజధాని పనులు ఆగిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇలాగైతే కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురారని స్పష్టం చేశారు. పోలవరం కాంట్రాక్టు రద్దు చేయటం ప్రాజెక్టుకు ఎంతో నష్టమని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగితే పనులు కొనసాగిస్తూనే విచారణ జరిపించాలని... ఇలా పూర్తిగా ఆపేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. పనులు జరుపుతూనే ఆడిట్లు చేసి చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే దానిపైనా వ్యతిరేకత వస్తోందని... ప్రైవేటు సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నాయని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాలూ వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇకపైనా అసెంబ్లీ సమావేశాలు ఫలప్రదంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్లు ఎంపీ సుజన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి వస్తే పోలవరం సమస్యకు సామరస్య పరిష్కారాని కోసం ప్రయత్నిస్తానని ఎంపీ సుజనా చౌదని పేర్కొన్నారు.