ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్.. చేస్తూ ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని అందులో తెలిపారు. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకున్నా... అవి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని పేర్కొన్నారు.
ప్రజా సేవకుడిగా తను అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ ఎక్కడా పేర్కొనలేదు కాబట్టి అనిశా చట్టం వర్తించదన్నారు. ఆ పక్షంలో ఈ కేసు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని పిటిషన్లో పేర్కొన్నారు. అనిశా కోర్టు దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్లు న్యాయస్థానానికి ఈరోజు హాజరయ్యారు.