MP RAGHURAMA KRISHNAM RAJU: దేశద్రోహంతో పాటు వివిధ సెక్షన్ల కింద తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం పరిశీలించింది. సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌తో పాటు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఏడీజీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్ సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు.
అది దేశద్రోహం ఎలా అవుతుంది...
సీఐడీ తనపై నమోదు చేసిన సుమోటో కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం ఐపీసీ సెక్షన్ 124ఏ , రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే 153 ఏ, 505,120 సెక్షన్ల కింద కేసు నమోదు చెల్లుబాటు కాదన్నారు. సీఐడీ ఇచ్చిన నివేదికను పరిశీలించినా ఆ సెక్షన్లు వర్తించవని తెలిపారు. పిటిషనర్ రెండు సామాజిక వర్గాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేసినట్లు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ .. సీఎం ప్రభుత్వంలో భాగమేకదా అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ ఒకవేళ సీఎంపై మాట్లాడిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఉన్నా.. అవి కేవలం అపవాదులు కిందకే వస్తాయని తెలిపారు. అంతేకాని దేశద్రోహం కాదన్నారు. ప్రభుత్వంపై తిగురుబాటు చేసినట్లు కాదని పేర్కొన్నారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా పిటిషనర్ మాట్లాడలేదన్నారు. గత ఏడు నెలలుగా స్తబ్దతగా ఉన్న ఈ కేసు .. పిటిషనర్ నియోజకవర్గానికి వెళ్లడానికి అధికారులకు సమాచారం ఇచ్చాక కదిలిందన్నారు. నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు సీఐడీ నోటీసులిచ్చి హాజరుకావాలంటూ కోరినట్లు తెలిపారు.
పిటిషనర్‌పై వ్యక్తిగత కక్షతో...
సీఐడీ అధికారి సునీల్ కుమార్ పిటిషనర్‌పై వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామ తరపు న్యాయవాది తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్‌ను దుర్వినియోగం చేసి సునీల్ కుమార్ ఇండియన్ పోలీసు సర్వీసులో చేరారని... ఈ వ్యవహారంపై పిటిషనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారన్నారు. ఎడబాటుగా ఉంటున్న సునీల్ కుమార్ భార్య .. పిటిషనర్ మద్దతుతో మీడియాకు ఇంటర్వూ ఇచ్చారనే భావనలో ఏడీజీ ఉన్నారన్నారు. సునీల్ కుమార్ ' అంబేడ్కర్ ఇండియా మిషన్'ను ఏర్పాటు చేసి అందులోని సభ్యులతో పిటిషనర్‌పై తప్పుడు కేసులు పెట్టించారని తెలిపారు. సీఐడీ ఏడీజీపై పిటిషనర్ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని సీఐడి తరపు న్యాయవాది చైతన్య వాదనలు వినిపించారు. కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ నోటీసులు జారీచేశారు.
ఇదీ చదవండి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!