రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు. ఆర్టికల్ 360 ద్వారా రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక స్థితిని ప్రకటించాలని కోరారు. ఏపీ రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక లోటు డిసెంబర్ నాటికే 68 వేల 536 కోట్లు దాటిందని.. ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా ప్రభుత్వానికి గగనమైపోతోందని చెప్పారు. జులైలో రెండో వారం వరకూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ.. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర రెవెన్యూ లోటు 18 వేల 434 కోట్ల రూపాయలుగా ఉందని రఘురామ చెప్పారు. ఇది 2020 డిసెంబర్ నాటికే 49 వేల 809 కోట్లు దాటిందన్నారు. ఇది బడ్జెట్‌లో పేర్కొన్న ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటు 48 వేల కోట్ల కన్నా అధికమని వివరించారు. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక లోటు 2020 డిసెంబర్ నాటికే 68 వేల 536 కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు.