ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్​ వేశారు'

పార్టీకి కానీ... ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికి కానీ తాను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలల్లో కొన్నింటిపై ఒక ఎంపీగా తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు ఇచ్చేందుకు అధికారం ఉండదని.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడికి మాత్రమే ఆ హక్కు ఉంటుందని చెప్పారు. ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీకి చెందిన కొందరు నేతల్లో వచ్చిన మార్పు, పోలీసుల తీరును చూసిన తరువాతనే కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణరాజుతో మా ప్రతినిధి తిరుపాల్‌ రెడ్డి ప్రత్యేక ముఖాముఖి.

'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్​ వేశారు'
'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్​ వేశారు'

By

Published : Jun 29, 2020, 2:48 PM IST

Updated : Jun 30, 2020, 8:07 PM IST

రఘురామకృష్ణరాజుతో ముఖాముఖి

ప్ర.ఈ మధ్య కాలంలో పార్టీ నుంచి మీకు లేఖలు అందుతున్నాయి. మీరు తిరిగి వాటికి సమాధానం ఇస్తున్నారు. పార్టీకి మీకు మధ్య ఏం జరుగుతోంది?

జ:విజయ సాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటిసు నాకు అర్థం కాక ఆయనకు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆయన మా పార్టీ లెటర్‌ హెడ్‌ కూడా వాడకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును వాడారు. నాకు ఇచ్చిన బీఫాంలో కానీ.. నా ఎన్నిక ధ్రువీకరణ పత్రంలోకానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని ఉంది. విజయసాయి రెడ్డి మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని ఇచ్చారు. ఇది నాకు అర్థం కాలేదు. ఇంతలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తనదంటూ... ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా నాకు ఫోన్‌ చేశారు. తన పార్టీ పేరు మీద నాకు షోకాజ్‌ ఎలా ఇస్తారని అడిగారు.

ప్ర.అసలు మీకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే వరకు ఎందుకు వెళ్లింది?

జ. నేను ఎప్పుడూ పార్టీపై చిన్న విమర్శ కూడా చేయలేదు. వ్యతిరేకంగా మాట్లాడలేదు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అసలు నేను మాట్లాడింది ఏమీ లేదు.

ప్ర.మీరు పార్టీ గురించి ఏమీ మట్లాడలేదు.... ఏమీ విమర్శించలేదు అంటున్నారు. మరి ఎందుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు?

జ.అదే నాకూ అర్థం కావడం లేదు. మూడు నాలుగు సార్లే మట్లాడాను. పార్లమెంటులో.. భాష గురించి ప్రస్తావన వచ్చినపపుడు తెలుగు భాషను కాపాడాలని చెప్పాను. ఆ విషయంపై గత ఏడాది నవంబరు 22న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో ఆ విషయం కూడా ప్రస్తావించారు.

ప్ర.మీకు మొత్తం 18 పేజీల షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. అందులో ఏయే అంశాలు ఉన్నాయి?

జ.ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం భూముల గురించి ఉంది. ఈటీవీతోనూ ఈ విషయం చెప్పాను. భక్తుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పాను. 14 వేల కోట్లు డిపాజిట్లు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన చిన్న చిన్న ఆస్తులను మనం కాపాడుకోలేమా అని.. మీడియాతో అన్నాను. హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదని ఒక భక్తుడిగా నేను స్పందించాను. 24 గంటల్లో ముఖ్యమంత్రి ఆ జీవోను రద్దు కూడా చేశారు. అయినా కూడా.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి ఆలా ఎందుకు మాట్లాడారని నాకు నోటీసు ఇచ్చారు. ముఖ్యమంత్రే కదా ఆ జీవోను రద్దు చేసింది. పార్టీ అధ్యక్షుడు అయిన మా ముఖ్యమంత్రికి కూడా నోటీసు ఇస్తారేమో నాకు తెలియదు.

ప్ర. విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీసుకు తిరిగి సమాధానం ఇచ్చారు. అందులో ఏమని వివరణ ఇచ్చారు?

జ. పార్టీలో నా ఉనికిని ప్రశ్నించినప్పుడు... ఆ ప్రశ్నించిన వ్యక్తి ఏ హోదాలో అడిగారన్నది... నేను ప్రశ్నించాను. అయినా... విజయసాయిరెడ్డికి 20 రకాల హోదాలు ఉన్నాయి. ఆయన ఏ హోదాలో షోకాజ్‌ నోటీసు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాను అని ఆయన అనుకుంటే... పార్టీకి ఒక క్రమశిక్షణా సంఘం ఉంటుంది. ఈయన ఏమైనా అందులో సభ్యుడా? నాకైతే తెలియదు. ఆ సంఘంలో సభ్యులు ఎవరనేది తెలుసుకునేందుకే ఎన్నికల కమిషన్‌ దగ్గరకు వెళ్లి ప్రశ్నించాను. మా పార్టీకి మద్దతుగా కొన్ని చానళ్లు ఉన్నాయి. ప్రభుత్వం మారగానే అవి ప్రభుత్వ చానళ్లుగా మారాయి.

ప్ర. మీరు ఏకంగా పార్టీ ఉనికినే ప్రశ్నించారు. పార్టీ పేరు వేరు... మీకొచ్చిన షోకాజ్‌ నోటీసులో వేరే పార్టీ పేరు ఉందని.. అంతే కాకుండా ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకని?

జ:నాకు అర్థం కాలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఏమైనా రిజిస్ట్రేషన్‌ ఉందా? అది తెలుసుకోడానికే కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాను. నాకు ఇచ్చిన నోటీసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని ఉంటే.. నాకు ఇచ్చిన బీఫాంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని ఉంది. అందుకో.. ఏది నిజమో తెలుసుకునేందుకు వెళ్లాను. ఒక సైనికుడిలా.. పార్టీ కార్యకర్తగా ఉన్న నా గురించి ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎలా? క్రమశిక్షణ సంఘం కాకుండా ఒక జాతీయ జనరల్‌ సెక్రటరీగా షోకాజ్‌ ఇచ్చేందుకు ఎలాంటి హక్కు లేదు.

ప్ర.షోకాజ్ నోటీసు వివరణ ఇచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లారు. చాలా మందిని కలిశారు. కేంద్ర హోం శాఖతో పాటు ఎన్నికల కమిటీని కూడా కలిశారు. వీరందరిని ఎందుకు కలిశారు? వాళ్లతో ఏం చర్చించారు?

జ. వాళ్ల దగ్గర మాట్లాడిన విషయాలు మీడియాకు చెప్పను. మా పార్టీకి అనుకూల మీడియాలో రాసుకున్నారు. రాజుగారు వెళ్లితే వాళ్లు సక్రమంగా పలకలేదు. దీంతో తెల్లముఖం వేసుకుని వెనక్కొచ్చారని. అదే నిజమేమో. పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి నాకున్న ఛైర్మన్‌ పోస్టును లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుంది. దానిని దక్కించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్ర.కేంద్ర హోంశాఖ దగ్గర మీరు ఏం అడిగారు? ఇంత కాలం పాటు భద్రతగా ఉన్న రాష్ట్ర సిబ్బందిని కాదని.. కేంద్ర భద్రతా సిబ్బందిని అడగడంలో మీ ఆంతర్యమేంటి?

జ. మీకు తెలుసో... తెలియదో. ఆంధ్రాలో పోలీసుల సాక్షిగా నా దిష్టిబొమ్మను దగ్ధం చేసి...ఫ్లెక్సీలను చించి.. వాటిపై రకరకాల పదార్థాలు వేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. బెదిరిస్తున్నారు. ఆ తర్వాత రాయలసీమలోని ఒక సామాజిక వర్గానికి చెంది... అమెరికాలో ఉన్న చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పోలీసుల సాక్షిగా జరిగిన విషయాలపై ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయలేదు. డీజీపీతో మాట్లాడదామని ప్రయత్నిస్తే అందుబాటులో లేరు. ఒక ఎంపీగా నేను ఫోన్ చేస్తే... తిరిగి సమాధానం రాలేదు. ఎంపీగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు.

ప్ర: అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భద్రతపై నమ్మకం లేక కేంద్ర ప్రభుత్వ భద్రతను కోరారా?

జ. నిజమే. అందుకనే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని లోకసభ స్పీకర్‌కు, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశాను. ఆ విజ్ఞప్తిని ఫాలో అప్‌ చేసేందుకే నేను లోకసభ స్పీకర్‌ను, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశాను. ఇండియా - చైనా యుద్ధ వాతావరణంలో రష్యా వెళ్లి వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ను కలిసి ఆయనకు సంఘీభావం తెలియచేశాను. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిని కలిసి భద్రత గురించి అడిగాను. ఈ విషయాన్ని మా పార్టీ మీడియా.. నాకు ప్రతికూలంగా రాసుకుంది.

ప్ర. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పాటను పోస్ట్‌ చేశారు?

జ. అవును నిజమే... మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి వర్మ ఒక దేశ భక్తి గీతాన్ని ఆయన వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశారు. అది నాకు నచ్చింది. నేను దానిని ఇతరులకు షేర్ చేశాను. అంతేగానీ అది వివాదాస్పదం అవుతుందని నాకు తెలియదు.

ప్ర. మళ్లీ మీరు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రధానంగా ఆ లేఖ ద్వారా ముఖ్యమంత్రిని ఏమని అభ్యర్థించారు?

జ.ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశాను. మొదట మా ముఖ్యమంత్రిని అభినందించాను. ఆయనకు వచ్చిన అవార్డుల గురించి ప్రస్తావించాను. తర్వాత ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయి రెడ్డి నాకు ఇచ్చిన నోటీసు గురించి కూడా ప్రస్తావించాను.

ప్ర.పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే చర్చించుకోవాలి గానీ... ఎందుకు మీరు మీడియా ముందుకు వస్తున్నారు?

జ. నేను ఎవరితో చర్చించాలి? నా పేరుతో వచ్చిన లేఖ నాకైతే నేరుగా రాలేదు. ఓ ప్రముఖ మీడియా సంస్థ ద్వారా బయటకు వచ్చింది. నాకు వాళ్ళు పంపిన లేఖ బయటకు ఎలా వచ్చింది? ఆ లేఖలో పొందుపరిచిన అంశాల్లో నాకున్న అనుమానాల్ని నా దగ్గర దాచుకోవాలా? అడక్కూడదా? నేను ఏమి అడిగానో... ప్రజలకు తెలియకూడదా? నన్ను నిజాలు చెప్పనివ్వండి. ఓ వ్యక్తి నన్ను, నా క్యారెక్టర్‌ను అవమానించేట్లు రాశారు. కొందరు తాను ఎక్కడ ముఖ్యమంత్రికి దగ్గరవుతానో... అని తొందరగా నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక కూడా వేస్తున్నారు. ఆ విషయం మా ముఖ్యమంత్రికి తెలియదు. ఈ రోజుకు కూడా ముఖ్యమంత్రికి నామీద కోపం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇటీవల... దిల్లీకి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు... పెద్దలను కలిసే సమయంలో నేను సీఎం వెంటే ఉన్నాను. ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నానని... దిల్లీ పెద్దల పట్ల సభ్యత లేకుండా ప్రవర్తించానని... ముఖ్యమంత్రి నా పట్ల అసహనం వ్యక్తం చేశారని కొందరంటున్నారు. ఇంకొందరు నన్ను ఎలాగైనా పార్టీ నుంచి వెళ్లగొడతారని, ఎలాగైనా వేటు పడటం ఖాయమని రాశారు. నేను మూడే అంశాలు చెబుతున్నా. ఒకటి.. ఇసుక మాయం, రెండు.. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం, మూడు.. పార్లమెంటులో తెలుగు భాషకు అనుకూలంగా మాట్లాడడం. ఇవి నేను చేసిన తప్పులా? పార్టీకి వ్యతిరేకంగా కానీ.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ.. నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వంపై ఒక ఎంపీగా మాట్లాడడంలో తప్పేముంది? అదే పార్టీ గురించి అయితే కొన్ని విధివిధానాలు ఉంటాయి. దానికి లోబడి మాట్లాడాలి. ప్రభుత్వ విధానాన్ని ప్రతి సభ్యుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రశ్నించవచ్చు. పార్టీ విధానానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి కూడా కూడా రాజ్యాంగ విరుద్ధం అయితే కచ్చితంగా ప్రశ్నిస్తా.

ప్ర. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు పార్టీ నుంచి వెళ్లిపోవడానికే ఇదంతా చేస్తున్నారంటున్నారు. మీరేమంటారు?

జ. ప్రచారమే కాదు. అది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే మా పార్టీలో ప్రముఖ నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలిసి నాపై అనర్హత వేటు వేయించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నన్ను తొలగించేందుకు దిల్లీ కేంద్రంగా.. ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను సుశిక్షితుడినైన పార్టీ కార్యకర్తను. శరత్ యాదవ్ లాగా నన్ను కూడా బయటకు పంపొచ్చని ముఖ్యమంత్రికి కొందరు నాయకులు చాడీలు చెబుతున్నారు.

ప్ర.ఎందుకు మీకు ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ ఇవ్వకుండా పోతున్నారు?

జ. నాకేం తెలుసు ఈ విషయంలో బాలశౌరి అడ్డుపడుతున్నారో... విజయసాయిరెడ్డి పడుతున్నారో నాకు తెలియదు. నాకైతే అపాయింట్మెంట్ రావడం లేదు. ఇది నిజం. శరత్ యాదవ్ విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. శరత్ యాదవ్ ప్రతిపక్షాలతో చేయి పట్టుకొని ర్యాలీలో పాల్గొని తాను స్థాపించిన పార్టీ తానే విడగొడతానని అన్నాడు. అయినా అదిప్పుడు న్యాయ పరిశీలనలో ఉంది. ఏ పార్టీ అయినా ప్రాథమిక హక్కులను హరించలేదు. అదేవిధంగా నేను ఎప్పుడూ పార్టీని పల్లెత్తు మాట అనలేదు...ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లోకసభ సభ్యత్వాన్ని తీయలేరు. ఎవరి మాటలు నమ్మొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా.

ఇవీ చదవండి:

'ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు'

Last Updated : Jun 30, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details