ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP Raghurama: 'సొమ్ము ప్రజలది.. పేర్లు మీవా?' - mp raghurama latest news

రాష్ట్రంలో జగనన్న, వైఎస్సార్‌ పేర్ల మీద చాలా పథకాలున్నాయని ఎంపీ రఘురామ ఆరోపించారు. సొమ్ము ప్రజలది.. పేర్లు మీవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తూర్పు గోదావరిలో ప్రారంభించిన కార్యక్రమానికి జగనన్న విద్యా కానుక అని పేరు పెట్టారని.. దీవెనలు అయిపోయాయి.. కానుకలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ప్రజలందరికీ దీవెనలు, కానుకలు ఇస్తూ తన పేరు పెట్టుకోవడం సమంజసం కాదన్నారు.

RRR
RRR

By

Published : Aug 17, 2021, 7:02 AM IST

‘జగనన్న, వైఎస్సార్‌ పేర్ల మీద రాష్ట్రంలో దాదాపు 48 పథకాలున్నాయి. ఇది న్యాయమా? సరైనదా? సొమ్ము ప్రజలది.. పేర్లు మీవా?’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి తూర్పుగోదావరిలో ప్రారంభించిన కార్యక్రమానికి జగనన్న విద్యా కానుక అని పేరు పెట్టారు. దీవెనలు అయిపోయాయి కానుకలు మొదలుపెట్టారు. ఇటీవల జగనన్న పాలు లక్ష ప్యాకెట్లు నేలపాలు అయినట్లు సమాచారం. తండ్రులు చనిపోతే ట్రస్టులు పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు సొంత సొమ్ము రూపాయి తీయకుండా ప్రభుత్వ సొమ్ముతో ఇలా చేస్తున్నారు. ప్రభుత్వంలో మనం ఉన్నామనుకున్నా కేంద్ర ప్రభుత్వ పథకాలకూ మన పేర్లు పెట్టి ఇలా చేయడం సరికాదు. పథకాలకు పేర్లపై పవన్‌ కళ్యాణ్‌ చేసినది సమంజసమైన వ్యాఖ్యే. పథకాలకు గాంధీ, పటేల్‌, వాజ్‌పేయీ, అబ్దుల్‌ కలాం వంటి వాళ్ల పేర్లు పెట్టొచ్చు. ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టారు. ప్రధానమంత్రి మాతృవందన యోజనలాగానే ముఖ్యమంత్రి యోజన పెట్టవచ్చు. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశా. ప్రతి దానికి జగనన్న అని తగిలిస్తున్నారు. మీరు ఎవరికి అన్న!. షర్మిలకు, సునీతకు, అవినాష్‌రెడ్డికి, ఇంకొందరికి అన్న. ప్రజలందరికీ దీవెనలు, కానుకలు ఇస్తూ మన పేరు పెట్టుకోవడం సమంజసం కాదు..’ అని రఘురామ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో రఘురామకు ఊరట

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండు సమర్పణకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. రాజద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు మే 21న బెయిలు మంజూరు చేసింది. ఆ సమయంలో గుంటూరు కోర్టులో రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండు పది రోజుల్లో సమర్పించాలని రఘురామను ఆదేశించింది.

నిర్ణీత సమయంలోనే తాను వ్యక్తిగత బాండు సమర్పించినా బాండు ట్రయల్‌ కోర్టులో అదృశ్యమైందని, మరోసారి సమర్పణకు ప్రయత్నించగా సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని గుంటూరు కోర్టు ఆదేశించిందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను సోమవారం విచారించింది. రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి మేరకు వ్యక్తిగత బాండు సమర్పణకు గడువును పొడిగించింది. పిటిషన్‌ విచారణను ముగించింది.

ఇదీ చదవండి:

Ramya Murder: అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details