ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించినట్టు.. ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, అమరావతి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని దిల్లీలో తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినట్టు చెప్పారు. అమరావతిపై మోదీ సానుకూలంగా ఉన్నట్లు.. ఆయన ముఖకవళికల ద్వారా స్పష్టంగా అర్థమైందన్నారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్లతో భవనాలు కూడా నిర్మాణం పూర్తయిందని.. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
"అమరావతిపై ప్రధాని మోదీ చాలా సానుకూలంగా కనిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆంధ్రుల మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అన్ని అంశాలను పరిగణించాకే నిర్ణయం ఉంటుందని ప్రధాని చెప్పారు. విశాఖ వాసుల సెంటిమెంట్ ను ప్రధాని కాపాడుతారని నాకు నమ్మకం ఉంది. రాష్ట్రంలో మత మార్పిడులపై 25 పేజీల నివేదికను ప్రధానికి ఇచ్చాను. ఈ అంశంపై కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాను.. ఒక్క క్రిస్టియన్ కూడా లేని గ్రామాల్లో 10 చర్చిలు ఉన్నాయి" - రఘురామకృష్ణరాజు, ఎంపీ