MP RRR Letter to CID: రాష్ట్ర సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఇవాళ విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. దిల్లీ వెళ్లాక తన ఆరోగ్యం బాగోలేదని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా.. తనకు 4 వారాల గడువు ఇవ్వాలని సీఐడీని కోరారు.
పారి పోలేదు.. ప్రాణరక్షణ కోసమే వచ్చా : ఎంపీ రఘురామ
సీఐడీకి లేఖ అనంతరం దిల్లీలో మీడియాతో ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. గతంలో ప్రాణభయంతో డీజీపీ ఆఫీసుకు పరుగులు పెట్టిన వారు.. ఇప్పుడు తనపై వ్యంగ్యంతో ట్వీట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణరక్షణ కోసమే తాను దిల్లీకి వచ్చాను తప్ప.. పారిపోయి రాలేదన్నారు. దిల్లీ వచ్చినప్పటి నుంచీ ఆరోగ్యం బాలేదని, ఇదే విషయమై సీఐడీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకూడదనే.. ఆరోగ్యం బాగాలేకపోయినా మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినట్లు చెప్పిన ఎంపీ రఘురామ.. కోర్టు విచారణకు హాజరు కాకుండా సీఎం చెప్పినట్లు కారణాలు చెప్పదలుచుకోలేదన్నారు.
"హు కిల్డ్ బాబాయ్" ప్రశ్నకు సమాధానం చెప్పండి..
కోడి కత్తి స్టోరీ ఏంటో..అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ఏమైందో అందరికీ తెలుసని ఎంపీ రఘురామ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో గొడ్డలి పోటును.. గుండెపోటు అని ఎలా చెప్పారో.. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు తో పలువురు తెదేపా నేతలపై తప్పుడు ఆరోపణలు చేశారని.. అవన్నీ ఇప్పుడు తేలిపోయాయని పేర్కొన్నారు. "హు కిల్డ్ బాబాయ్" ప్రశ్నకు.. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
ఇవే ఆఖరి సమావేశాలు..
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ని ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి, మరో రాష్ట్రానికి పంపాలని ప్రధానికి లేఖ రాసినట్లు ఎంపీ రఘురామ వెల్లడించారు. ప్రస్తుత తన ఎంపీ సభ్యత్వానికి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలే ఆఖరి సమావేశాలని తేల్చి చెప్పారు. రాజీనామా తర్వాత మళ్ళీ పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే దిల్లీలో ఉన్నట్లు వెల్లడించారు. తనపై పోటీకి విజయసాయిరెడ్డి రావాలని సవాల్ విసిరారు.
రఘురామకు సీఐడీ నోటీసులు ఎందుకంటే?
CID Notice To RRR: జనవరి 12వ తేదీన హైదరాబాద్లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Telangana Night Curfew: నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో తెలంగాణ సర్కార్!