మనమిచ్చే అష్టరత్న పథకాలకు నిధులు ప్రధానంగా నవరత్నమైన మద్యం అమ్మకాలనుంచే వస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ‘అధికారంలోకి వస్తే మద్యం విక్రయాలను నిషేధించి లక్షలాది మహిళల మోముల్లో సంతోషాన్ని తెస్తామని మీరు హామీనిచ్చారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ మూడు దశల్లో మద్యనిషేధం విధిస్తామని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం మద్యం విక్రయాలపై వచ్చే పన్నులతో కలుపుకొని ఆదాయం రూ.30వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెరిగింది. 2018-19లో మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.5,789 కోట్ల రాబడిరాగా.. మరుసటి ఏడాది అది రూ.7,359 కోట్లు అయింది. దీనికి అదనంగా అమ్మకాల ఆదాయంతో రూ.8,500 కోట్లు వచ్చింది. మనం చెప్పినట్లు దశలవారీగా మద్య నిషేధం విధించినా అంకెలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. మొదటి దశలో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతోపాటు మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తామన్నారు. రెండేళ్లలో మద్యం దుకాణాలను 4,380 నుంచి 2,934కు అంటే 33 శాతం తగ్గించామని.. బార్లను 840 నుంచి 530కు అంటే 40 శాతం తగ్గించామని, 43 వేల గొలుసుకట్టు దుకాణాలు మూసేశామని చెబుతున్నారు. మనం అధికారంలోకి రావడానికి సహకరించిన మహిళలను దృష్టిలో పెట్టుకొని మీకు ఈ లేఖ రాస్తున్నా. వారి ఆకాంక్షలను అందుకునేలా నైతిక బాధ్యతతో కచ్చితంగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి.' అని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
Raghurama letter to CM Jagan: ' మద్యం అమ్మకాలతో నవరత్నాలకు నిధులు' - మద్యపాన నిషేదంపై రఘరామ లేఖ
ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావట్లేదని ఎంపీ రఘురామ అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలని సీఎం జగన్‌కు తొమ్మిదో లేఖ రాశారు.
'రెండో దశలో పన్నులు పెంచితే పేద, మధ్యతరగతి ప్రజలు వాటిని భరించలేరని మీరు చెప్పారు. కానీ గతేడాది మద్యం అమ్మకాల్లో 16 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో రూ.6,336 కోట్లను 42 లక్షల కుటుంబాల్లోని మహిళలకు ‘అమ్మఒడి’ మొదటి దశ కింద అందజేశారు. దీంతో ఈ పథకం ‘అమ్మ ఒడి-నాన్న బుడ్డి’లా ప్రాచుర్యం పొందింది. చివరగా మద్యం విధానంపై నిషేధంనుంచి నియంత్రణ అంటూ మన ప్రభుత్వం రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన 16పేజీల బుక్‌లెట్‌లో పేర్కొనడం ప్రజలకు సబబుగా తోచడం లేదు. మద్యం ధరలు పెంచకముందు నా నియోజకవర్గ పరిధిలో దినసరి కూలీ రూ.500గా ఉండేది. ఇప్పుడు పెరిగిన మద్యం ధరలను కలుపుకొని రూ.150 అదనంగా మత్స్య రైతులపై విధించి కూలీని రూ.650కి పెంచారు. ఈ పెంపు మధ్యతరగతి ప్రజలకు భారమే. ఇది పార్లమెంటు సభ్యుడిగా నా వ్యక్తిగత అనుభవం. వివిధ బ్యాంకుల నుంచి రూ.10వేల కోట్ల రుణాలు తీసుకోవడం, మద్యం అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గడిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధం నుంచి నియంత్రణ దిశగా మార్చుకుందని నాకు అర్థమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ప్రభుత్వం రూ.17,600 కోట్లు ఆర్జించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాటంనుంచి తప్పించేందుకు అన్ని దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టాలి. మహిళల ఆకాంక్షలకు తగ్గట్టు పూర్తిగా మద్యనిషేధం విధించాలని కోరుతున్నా. ఒకవేళ అలా చేయలేక మన హామీనుంచి వైదొలిగేటట్లయితే రాష్ట్రంలో దొరికే ప్రెసిడెంట్ మెడల్, రాయల్‌సింహా, ఛాంపియన్, బ్యాంకర్స్ క్లబ్ వోడ్కా, ఆంధ్రాగోల్డ్, గవర్నర్స్ రిజర్వు వంటి బ్రాండ్లు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా లభించే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచండి. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరే తక్కువ ధరకు మద్యం దొరికేలా చూడండి’ అని లేఖలో రఘురామకృష్ణ సూచించారు.
ఇదీ చదవండి: