సమయం చూసుకొని రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూకటివేళ్లతో పెకిలించేలా శంఖారావం పూరించనున్నట్లు వైకాపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి మంచి మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు.
తమ పార్టీ నాయకులు తాను మాట్లాడడం తప్పు అంటున్నారు తప్ప.. వారు చేసేవి తప్పు అని చెప్పడం లేదన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచకపోయి ఉంటే.. యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయమని అడుగుతున్న విద్యార్థులను అరెస్టు చేయడం తగదన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని, ప్రభుత్వానికి తెలిసిన వారితో కేసు వేయించి అర్ధరాత్రి అరెస్టు చేయించారని ఎంపీ రఘరామ విమర్శించారు. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు. ఆయన తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప.. సీఐడీకి కేసు అప్పగించడమేమిటన్నారు.