ఎంపీ అయిన తన తండ్రిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ.. రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. రెండు పేజీల లేఖతో పాటు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, పోలీసు కస్టడీలో తన తండ్రికి తగిలిన గాయాలు, శనివారం ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను జత చేశారు. తాను సమర్పించిన రికార్డులన్నీ పరిశీలించి.. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎంపీ రఘురామ కుమారుడు భరత్ కోరారు.
భారతీయ పరిపాలన, న్యాయవ్యవస్థపై సామాన్యులకు విశ్వాసం కలిగేలా చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కాగా.. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ ఆదివారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీలు నేడు విచారణకు రానున్నాయి. సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రఘురామ ఒక పిటిషన్ వేశారు. సీఐడీ కస్టడీలో తన తండ్రి దాడికి గురైనందున ఆయనకు దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆయన కుమారుడు భరత్ మరో పిటిషన్ వేశారు. తన తండ్రికి ప్రాణహాని ఉన్నందున వై-కేటగిరీ భద్రతను కొనసాగించేలా ఉత్తర్వులివ్వాలని కూడా పిటిషన్‌లో కోరారు.