ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు సీజే బదిలీపై రాష్ట్రపతికి రఘురామ లేఖ - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు

అమరావతి కేసుల విచారణ పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీని ఆపాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేలను వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు వారికి ఎంపీ విడివిడిగా లేఖలు రాశారు. అమరావతి రైతులు సర్వస్వం ధారపోసి సీనియర్‌ న్యాయవాదులకు ఫీజులు చెల్లించారని... తీర్పు వెలువడాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ అయితే వారి త్యాగాలు వృథా అవుతాయని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

By

Published : Dec 17, 2020, 7:14 PM IST

Updated : Dec 17, 2020, 7:24 PM IST

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ పూర్తయ్యే వరకు ఆంధప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీని నిలిపివేయాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డేలకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. 30 వేల మంది అమాయక రైతుల తరఫున చేతులు జోడించి చేస్తున్న ఈ ప్రార్థనను దయచేసి మన్నించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, సీజేఐలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం అర్థిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై హైకోర్టులో రోజువారీ ప్రాతిపదికన విచారణ నడుస్తోందని వివరించారు. అన్నివైపులా వారి వాదనలు దాదాపు పూర్తి కావొచ్చాయన్న ఎంపీ.. ఇలాంటి కీలక సమయంలో కేసు విచారిస్తున్న న్యాయమూర్తిని బదిలీ చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల తరఫున అభ్యర్థిస్తున్నా

'రాజధాని కోసం పంట భూములను త్యాగం చేసిన చిన్న, సన్నకారు రైతులు చందాలు పోగు చేసుకొని, అప్పులు చేసి న్యాయవాదులకు ఫీజులు చెల్లించారు. తమ సర్వస్వాన్ని ధారపోసి న్యాయవ్యవస్థపై నమ్మకంతో సీనియర్‌ న్యాయవాదులకు కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించారు. అమరావతి వ్యాజ్యాలపై తీర్పు వెలువరించే సమయంలో... న్యాయమూర్తిని బదిలీ చేయడం ఆనాలోచితం. కొలీజియం విశేషాధికారాన్ని నేను ప్రశ్నించటం లేదు. అయితే ప్రస్తుతం తుది దశలో ఉన్న కేసుపై తీర్పు వెలువరించిన తర్వాతే కొలీజియం నిర్ణయం ప్రకారం ఆయన్ను బదిలీ చేయాలని కోరుతున్నాను. కోర్టు ఖర్చుల కోసం ఇంకేమీ మిగలని రైతుల ఆశలను ఈ నిర్ణయం పూర్తిగా నలిపేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం కారణంగా 95 మంది రైతులు ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేశారు. ఇలాంటి సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించకుండా న్యాయమూర్తిని బదిలీ చేస్తే ఆ త్యాగాలన్నీ వృథాగా పోతాయి. రాబోయే ప్రధాన న్యాయమూర్తి సమర్థత, స్వతంత్రతపై ఏమాత్రం సందేహం వ్యక్తం చేయడం లేదు. కేవలం రైతుల వర్ణనాతీతమైన దీనగాథను దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ పూర్తయి, తీర్పు వెలువడేలా చర్యలు తీసుకోవాలని అర్థిస్తున్నా' అని లేఖలో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ..!

Last Updated : Dec 17, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details