MP Lavu Srikrishnadevarayalu: రైల్వేశాఖ ఎంవోయూలను పునఃసమీక్షించి రాష్ట్ర ప్రభుత్వ వాటాను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. "ఈ బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల కోసం ఏపీకి రూ.9వేల కోట్లు కేటాయించడంవల్ల సంతోషించాలో... బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం 2014కు ముందు కేటాయించిన ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించకపోవడమే. భూసేకరణ, ఇతర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా సమకూర్చలేదని రైల్వేశాఖ చెబుతోంది. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీశారు. విభజన తర్వాత మాకు రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చింది. ఒకప్పుడు ఝార్ఖండ్ ప్రభుత్వం రైల్వేశాఖతో ఎంవోయూ కుదుర్చుకుని అక్కడ చేపట్టే ప్రాజెక్టులకు 67:33 నిష్పత్తిలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. కానీ 2011లో రైల్వేశాఖ ఆ ఒప్పందాన్ని పునఃసమీక్షించి అక్కడి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంది. అలాగే ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించాలి" అని శ్రీకృష్ణదేవరాయలు కోరారు. లోక్‌సభలో మంగళవారం రైల్వే బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
- రుణభారంలో ఏపీ రైతులది మూడోస్థానం
బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.18,42,027 కోట్లు కాగా ఇందులో 7.62% భారం ఏపీ రైతులపై ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. అప్పుల భారం ఆరేళ్లలో 63% పెరిగింది. రుణభారం ఎదుర్కొంటున్న వారి సంఖ్య 25% పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి అత్యధిక రుణ భారం మహారాష్ట్ర రైతులపై రూ.5,52,264 కోట్లు, తమిళనాడు రైతులపై రూ.2,18,827 కోట్లు ఉండగా ఏపీ రైతులు మూడో స్థానంలో నిలిచారు.
- ఏపీలో ఏటా తగ్గుతున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు