MP Galla Jayadev letter to the Railway Minister:ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను అమరావతితో అనుసంధానిస్తూ... సర్వే చేసిన రైలు మార్గాల పనులను త్వరగా ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంతో పాటు.. తన నియోజకవర్గమైన గుంటూరు పరిధిలో నెలకొన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ... ఆయన రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దేశంలో 5 రైల్వే విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతామని ప్రతిపాదించారని.. వాటిలో ఒకదానిని గుంటూరు సమీపంలో ఏర్పాటు చేయాలని కోరారు.
చుండూరు-విజయవాడ మధ్య గతంలో ఉన్న బైపాస్ మార్గాన్ని పునరుద్ధరిస్తే.. రాజధాని అమరావతికి దక్షిణాది రాష్ట్రాల నుంచి రైలు మార్గం దగ్గరవుతుందని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. దేశ నలుమూలలకు విజయవాడ నుంచి వెల్లే రైళ్లకు.. మంగళగిరి స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. గతంలోనే మంజూరైన శ్యామలానగర్-ఎన్జీవో కాలనీ ఆర్‌యూబీ.., ఓల్డ్ గుంటూరు-నందివెలుగురోడ్డులోని ఆర్‌వోబీ, తెనాలి-గుంటూరు మధ్య లైన్ క్రాసింగ్‌లను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేటాయించిన విశాఖ రైల్వే జోన్ పనులు త్వరగా పూర్తి చేయాలని గల్లా జయదేవ్ లేఖలో విజ్ఞప్తి చేశారు.