అమరావతి రైతులు మరోసారి ఉద్యమ గర్జన చేశారు. రాజధాని శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన వేళ రైతులు మరోసారి కదం తొక్కారు. చలో ఉద్ధండరాయునిపాలెం అంటూ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి పాదయాత్ర చేశారు. గుంటూరులోని మదర్ థెరిసా విగ్రహం నుంచి అమరావతి ఐకాస నేతలు , వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి రైతులు ముందుకు సాగారు. గోరంట్ల, లాం ఫాం, తాడికొండ, పెదపరిమి తుళ్లూరు మీదుగా పాదయాత్ర నిర్వహించారు. కొందరు ప్రధాని మోదీ చిత్రపటాలు పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన ప్రధానికీ అమరావతిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేయడమే మహాపాదయాత్ర ఉద్దేశమని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
పాదయాత్ర మధ్యలో వివిధ గ్రామాల్లోని రైతులు, నేతలు జతకలిశారు. తాడికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించగానే..మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వారితో కలిసి ముందుకు సాగారు. తాడికొండ అడ్డరోడ్డుకు చేరే వరకు స్థానికులు ఎండను లెక్కచేయకుండా ఎదురుచూశారు. ఆ తర్వాత అందరూ కలిసి ఉద్ధండరాయునిపాలెం వెళ్లారు.
సర్వమత ప్రార్థనలు
రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు చలో ఉద్ధండరాయునిపాలెం కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఎర్రబాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం రైతులు మందడం దీక్షా శిబిరం నుంచి బయల్దేరగా..రాయపూడి నుంచి మరికొన్ని రైతు కుటుంబాలు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లాయి. ఒక రాష్ట్రం - ఒకే రాజధాని అంటూ దారి పొడవునా మహిళలు నినదించారు. మహా పాదయాత్రలో రాయపూడి, వెలగపూడి, ఐనవోలు గ్రామాల రైతుల ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ సర్వమత ప్రార్థనలు చేశారు. 13 జిల్లాల పేరుతో పుణ్యస్థలి వద్ద పొంగళ్లు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజధానిగా అమరావతి కొనసాగేటట్లు ప్రధాని మోదీ చొరవ చూపాలని రైతులు, మహిళలు విన్నవించారు.
పలు పార్టీల మద్దతు