తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు రోజుల్లోనే 150 మందికి పైగా విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే ఇప్పటివరకు 100 మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధరించారు. మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల్లో 29 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసాలోని జ్యోతిబాపులే బాలుర గురుకులంలో 176 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 25 మందికి వైరస్ సోకింది. ఆదిలాబాద్‌లో జిల్లాలో వివిధ ప్రభుత్వ బడుల్లో నిర్వహించిన పరీక్షల్లో 35మంది విద్యార్థులతోపాటు మరో 21 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
వంటమనిషి సహా
జగిత్యాలలో బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుతుండగా.. 17 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు వైరస్ బారినపడ్డారు. 20 మంది విద్యార్థినులకు జ్వరం రాగా.. వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలోనూ.. 60 మందికి పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి కరోనా నిర్ధరణ అయింది. యాదాద్రి తుర్కపల్లి పాఠశాలలో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర వసతి గృహంలో 92 మందికి పరీక్షలు నిర్వహించగా.. 22 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు తేల్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో వంటమనిషి సహా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో.. 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి కరోనా సోకింది.
పరీక్షలు యథాతథం
ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతిగృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినిలకు కరోనా సోకింది. వసతిగృహంలో మొత్తం 400 మంది ఉంటున్నారు. శనివారం నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున.. అందరికీ వైద్య పరీక్షలు చేశాకే.. నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు మాత్రం పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారికి తర్వాత పరీక్షలు ఉంటాయని.. వారిని సప్లిమెంటరీగా పరిగణించమని తెలిపారు. అందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.