ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కరోనా విజృంభణ.. 943కు చేరిన కేసులు - telangana corona updates

తెలంగాణలో కరోనా మహమ్మారి భయాందోళనలు సృష్టిస్తూనే ఉంది. బుధవారం 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 943 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. కరోనాతో మరొకరు మృతిచెందారు. వైరస్‌ కట్టడికి అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. సూర్యాపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో... ఆ రాష్ట్ర సీఎస్​ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వైరస్‌ నియంత్రణకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ.. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.

corona-cases-tested
తెలంగాణలో కరోనా విజృంభణ.. 943కు చేరిన కేసులు

By

Published : Apr 23, 2020, 7:37 AM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 15 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. ఇప్పటి వరకు 943 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నిన్న మరొకరు మృతి చెందడం వల్ల కరోనా మృతుల సంఖ్య 24కు చేరింది. 194 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యునాని వైద్యుడు.. కరోనాతో మృతి చెందారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకగా.. వారికి గాంధీలో చికిత్స అందిస్తున్నారు. విజయనగర్‌ కాలనీ సమీపంలో.. జీహెచ్​ఎంసీ నిర్వహిస్తున్న తాత్కాలిక షెల్టర్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న యాచకురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. దీంతో అక్కడ ఉన్న 34 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారులు నిఘా పెట్టారు.

సూర్యాపేటలో..

అత్యధికంగా కేసులు నమోదవుతున్న సూర్యాపేటలో.. రాష్ట్ర అత్యున్నత స్థాయి బృందం పర్యటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. అత్యధిక కేసులు వెలుగుచూసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 83 కేసులు నమోదు కాగా.. సూర్యాపేట పట్టణంలో 54 కేసులు వెలుగు చూశాయి. సీఎస్, డీజీపీ అక్కడి పరిస్థితులను పరిశీలించి.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టరేట్​లో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని.. సర్కారు నిబంధనలు పాటించాలని సూచించారు. ఇక ఇప్పటికే డీఎంహెచ్​వో, డీఎస్పీపై వేటుపడగా.. తాజాగా పట్టణ సీపీ శివశంకర్​ను కూడా ఆకస్మికంగా బదిలీ చేశారు.

గద్వాలలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 34కు చేరింది. వీరిలో నలుగురు కోలుకున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి.. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. గద్వాలలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో.. జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో.. అక్కడి నుంచి ఎవరూ రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యయి. సంబంధిత కాలనీలను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన.. నారాయణపేట మండలం అభంగాపురంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామంలోని 651 మందికి ధర్మల్ స్కానింగ్ నిర్వహించారు.

ఖమ్మంలో మిర్చి అమ్ముకుని.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లాతండా వచ్చిన ఇద్దరు రైతులను.. గ్రామస్థులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు. కరోనా సోకిందనే అనుమానంతో వారిని శివారులోనే నిలిపివేశారు. దీంతో వారు గంటల తరబడి ఎదురుచూడక తప్పలేదు. ఎట్టకేలకు 108 వాహనంలో వైద్య పరీక్షల కోసం సూర్యాపేటకు తరలించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారుల మధ్య ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్‌ను.. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే.. అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు మంత్రి సూచించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌లో భాగంగా లాక్​డౌన్‌ని ప‌క‌డ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నిరుపేదలకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మే 7 వరకు కాదని సంవత్సరం మొత్తం ఉండొచ్చని.. వినోద్‌ కుమార్‌ తెలిపారు.

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. లాక్‌డౌన్‌ అమలుకు సంబంధించి.. పట్టణంలో ద్విచక్రవాహనంపై తిరిగి పరిశీలించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఓ గిరిజన మహిళకు వైరస్​ సోకింది. జిల్లాలో కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో కరోనా వ్యాప్తికి సంబంధించి.. మంత్రి హరీశ్‌ రావు స్థానికంగా పర్యటించారు. ఈ నెల 26 వరకు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో సంపూర్ణ లాక్​డౌన్‌కు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పని చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లాలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులు... 8 మందికి పరీక్షలో నెగిటివ్‌ రావటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. 28 రోజులు తర్వాత మరోసారి పరీక్షలు జరపనున్నారు.

ఇవీచూడండి: 'ఉద్దీపనలు అమలైతేనే... పరిశ్రమలకు ఊతం'

ABOUT THE AUTHOR

...view details