ఈ ఏడాది వాతావరణశాఖ అంచనాల కన్నా ముందుగానే.. నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని తాకాయి. దీంతో.. తొలకరి ముందుగానే పలకరిస్తుందని.. ఇక వ్యసాయ స్కోరు బోర్డు జోరుగా పరుగులు తీస్తుందని అన్నదాతలు, వేసవి హీట్ యార్కర్లు తప్పినట్టేనని సామాన్య జనాలు ఆశించారు. కానీ.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రుతు పవనాలు గ్రౌండ్లోకైతే దిగాయి గానీ.. బ్యాటింగ్ మాత్రం చేయట్లేదు. పింఛ్ హిట్టింగ్ సంగతి అటుంచితే.. కనీసం సింగిల్స్ డబుల్స్ మాదిరిగా.. అక్కడో.. ఇక్కడో.. నేలను తడుపుతాయేమో అంటే.. అదికూడా లేకుండా పోయింది. పరమ జిడ్డుగా డిఫెన్స్ ఆడేస్తున్నాయి.
"కరగని నైరుతి మేఘం.." ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా..? - నైరుతి రుతుపవనాలు
జూన్ మాసం వస్తోందంటే.. తొలకరి చినుకులు క్యాచ్ పట్టేందుకు జగమంతా ఎదురు చూస్తుంది! కొండా గుట్టల నుంచి పొలం గట్ల దాకా.. చెట్టూ చేమ నుంచి గొడ్డూ గోదా వరకు.. ఆకాశం వంకనే చూస్తుంటాయి. ఏరువాక సాగేందుకు కష్టజీవి.. ఏసీ గాలికి టాటా చెప్పేందుకు సగటు జీవీ ఆరాటపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. "ఈ సాలున.. తొలకరి మ్యాచ్ ముందే స్టార్ట్ కాబోతోంది.. ఆడియెన్స్ రెడీ.." అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది వాతావారణ శాఖ! ఇంకేముంది? వరుణుడు టీ20ని మించిన బ్యాటింగ్ చేస్తాడని ఆశించిన జనాలంతా.. రెయిన్ మ్యాచ్ కోసం ఎదురు చూడ్డం మొదలు పెట్టారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రయల్ బాల్స్ కూడా పడలేదు. దీంతో.. రెయినీ సీజనల్ మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా.. అని అందరూ ఎదురు చూస్తున్నారు. "పొరపాటున రద్దయితే కాదుగదా..?" అని మరికొందరు సందేహిస్తున్నారు కూడా..!
వాతారణం ప్రతికూలంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు.. వాతావరణ శాఖలోని ఫోర్త్ అంపైర్స్! నైరుతి రుతుపవనాలకు ఏమాత్రం అనుకూలించని వెదర్ లో.. వేడిగాలులు యార్కర్లు, షార్ట్ పిచ్ బంతుల్లా దూసుకొస్తున్నాయని చెబుతున్నారు. అందుకే.. రుతు పవనాలు ముందుకు కదల్లేకపోతున్నాయని చెబుతున్నారు. కేరళ తీరంలోకి తేలిగ్గానే అడుగు పెట్టినప్పటికీ.. దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి విస్తరించడం రుతుపవనాలకు చాలా కష్టంగా మారిందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఆ తర్వాత గానీ నైరుతి బ్యాటింగ్ జోరందుకోవచ్చని భావిస్తున్నారు. జూన్ 15 తేదీనాటికి మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ వరకూ విస్తరించొచ్చని అంటున్నారు. కానీ.. ప్రస్తుతం వాటి కదలిక మాత్రం అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. వాస్తవానికి.. ఈపాటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి.. జోరు వానలతో రచ్చ చేయాల్సి ఉంది. కానీ.. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల బౌన్సర్లు సంధిస్తున్నాయన్నది వెదర్ రిపోర్టు. వాటిని ఛేదించలేకనే.. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు రాలేకపోతున్నాయని సారాంశం.
ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణె, కర్ణాటకలోని గడగ్, బెంగుళూరు, తమిళనాడు లోని పాండిచ్చేరి వద్దనే.. రుతుపవనాల ఉత్తర కొన డిఫెన్స్ ఆడుతున్నట్టు తెలుస్తోంది.అయితే.. ఐఎండీ రిపోర్టు మాత్రం ఆశలు రేపుతోంది. రాగల 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర, కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకూ.. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరిస్తాయని స్పష్టం చేస్తోంది. కానీ.. ఓ డౌటనుమానం కూడా వేధిస్తోంది! ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలు ఎక్కడి వరకైతే విస్తరించాయో.. ఆ ప్రాంతాల్లోనూ సరైన వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. వాతావరణ అధికారులు మాత్రం.. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల.. వరుణుడి బ్యాటింగ్ జోరుగా మొదలువుతుందనీ.. బౌండరీలతో విరుచుకుపడి, సెంచరీలు నమోదు చేయడం గ్యారంటీ అని టాస్ వేసి మరీ చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుంది? ఈ రెయినీ సీజన్లో వరుణుడి బ్యాటింగ్ ఎలా ఉండబోతోంది? తనదైన ఇన్నింగ్స్ తో వీరవిహారం చేసి అందరినీ సంతృప్తి పరుస్తాడా? నిరాశగా పెవిలియన్ చేరుతాడా?? అన్నది చూడాలి.