భారతదేశం ముందుకు వెళ్లాలంటే ప్రధాని మోదీలాంటివారు ఎంతో అవసరమని సినీనటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. దిల్లీలో ప్రధాని మోదీని ఆయన ఇవాళ ఉదయం కలిశారు. ప్రధానితో భేటీ సమయంలో ఆయన వెంట మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి ఉన్నారు. 45 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ సమావేశాల అనంతరం మోహన్ బాబు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టమని... ఒక సినీనటుడిగా మాత్రమే ఆయనను కలిశానని చెప్పారు. లోపల ఏం మాట్లాడుకున్నామన్న విషయాల్ని అవసరం వచ్చినప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.
'మోదీ మిమ్మిల్ని భాజపాలోకి ఆహ్వానించారా' అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. అలాగే రాష్ట్రంలో జగన్ పాలన బాగుందని కితాబిచ్చారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ... దక్షిణాది నటులతో త్వరలో మోదీ భేటీ అవుతారని చెప్పినట్లు వెల్లడించారు. ఆయనకు దక్షిణాది, ఉత్తరాది ఉన్న వివక్ష లేదని అన్నారు.