ప్రధాని హోదాలో అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ...రాజధాని తరలిపోకుండా అడ్డుకోవాలని రాజకీయేతర ఐకాస కన్వీనర్ మల్లిఖార్జున రావు విజ్ఞప్తి చేశారు. అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లయిన సందర్భంగా గుంటూరు నుంచి ఉద్దండరాయనిపాలెం వరకూ జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. జగన్ మూడు రాజధానుల ప్రకటనను తప్పుపట్టిన ఆయన...రాష్ట్రాభివృద్ధికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వారికి జతకలిసి రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 310 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా... జగన్ పట్టించుకోకపోవటం దారుణమని తెలుగుమహిళ నాయకురాలు రాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొండి పట్టు వీడనాడి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళల్ని కించపర్చేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తమకు పోటీగా ప్రభుత్వమే పెయిడ్ ఉద్యమం నడిపిస్తోందని దుయ్యబట్టారు.