ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ! - Who is Diksha Singh?

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ!
పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ!

By

Published : Apr 4, 2021, 5:03 PM IST

ఈ నెల 15 నుంచి ఉత్తర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అక్కడి జాన్‌పూర్‌ జిల్లా బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ పంచాయతీ పేరు ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతోంది. ఎందుకంటే ఇక్కడి 26 వ వార్డు నుంచి మోడల్‌ దీక్షా సింగ్‌ బరిలోకి దిగుతోంది. అలాగనీ ఆమె సాధారణ మోడలేమీ కాదు. 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. నేహా కక్కర్‌, దివ్యా ఖోస్లా కుమార్‌ వంటి సంగీత ఉద్ధండులు పాడిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, వీడియోల్లో నటించి మెప్పించింది. అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో ప్రస్తుతం అందరూ ఈ పంచాయతీ గురించే మాట్లాడుకుంటున్నారు.

చదువుతూనే మోడలింగ్‌ రంగంలోకి!

పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ!

దీక్షా స్వస్థలం బక్షా ప్రాంతంలోని చిట్టోరి అనే గ్రామం. మూడో తరగతి వరకు ఇక్కడే చదువుకుంది. అయితే తండ్రి జితేంద్ర వ్యాపార రీత్యా ఆమె కుటుంబం ముందు ముంబయి, ఆ తర్వాత గోవాకు వెళ్లి స్థిరపడింది. గోవాలోని జువారీనగర్‌లోని ఎంఈఎస్‌ కాలేజ్‌ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆమె చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఇదే క్రమంలో 2015 మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనల్‌ దాకా వెళ్లింది. గతేడాది ఆమె ‘తేరీ ఆఖో మే’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించింది. బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ నేహా కక్కర్‌ ఆలపించిన ఈ పాటను యూట్యూబ్‌లో 28కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నటించిన ‘రబ్బా మెహర్‌ కరి’ మ్యూజిక్‌ వీడియోకు ఇప్పటివరకు 5కోట్లకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. దీక్షకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా భారీగానే ఉంటోంది. ఇన్‌స్టాలో తనను సుమారు 2.64లక్షల మంది అనుసరిస్తున్నారు.

అందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నా!

ఇలా మోడలింగ్‌లో ఎన్నో మెరుపులు మెరిపించిన ఈ ముద్దుగుమ్మ తండ్రి కోరిక మేరకు అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. జితేంద్ర సింగ్‌ బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని 26 వ వార్డు నుంచి పోటీ చేసేందుకు చాలా రోజుల నుంచే సిద్ధమవుతోంది. అయితే ఈ స్థానాన్ని అనూహ్యంగా మహిళలకు కేటాయించడంతో తన కూతురు దీక్షను బరిలోకి దింపారు జితేంద్ర. ‘నేను చదువుకునే రోజుల నుంచే వివిధ అందాల పోటీల్లో పాల్గొంటున్నాను. అదే సమయంలో కొన్ని రాజకీయ చర్చలకు కూడా హాజరయ్యాను. నేను ఎక్కడున్నా అప్పుడప్పుడూ తరచుగా ఈ గ్రామానికి వస్తున్నాను. కానీ ఎప్పుడొచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకే మార్పు తీసుకురావాలనే ముఖ్యోద్దేశంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తన పంచాయతీ ప్రజలతో చెబుతోందీ బ్యూటీ క్వీన్‌.

ఇదీ చూడండి:

మోడరన్​ లుక్​లో స్టైలిష్​స్టార్ సతీమణి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details