ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంఎంటీఎస్​ ప్రమాదానికి పని ఒత్తిడే కారణమా!? - mmts train accident issue in kachiguda

తెలంగాణలోని కాచిగూడలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ ఢీకొన్న ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులను తరలిస్తున్న రైలు నిర్వహణలో లోపాలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.

ప్రమాదానికి పని ఒత్తిడే కారణమా!?

By

Published : Nov 13, 2019, 12:08 PM IST

‘రైలు ప్రమాదానికి కారణమని భావిస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ అనుభవజ్ఞుడే. సోమవారం మరి ఏమయ్యిందో కాచిగూడలో సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు దూసుకెళ్లాడ’ని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.

చంద్రశేఖర్‌ 2011లో సహాయ లోకోపైలట్‌గా చేరాడు. అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి లోకోపైలట్‌గా మారాడు. మూడు నెలల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను మొత్తం 48 ట్రిప్పులు తిప్పాడు. లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంపై పూర్తి పట్టు ఉంది. సిగ్నల్‌ను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమైంది. పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం తదితర కోణాల్లో ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ కేర్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో వైద్యం పొందుతున్నాడు.

16 ఏళ్లుగా ఎంఎంటీఎస్‌కు సంబంధించి పెద్దగా ప్రమాదాలు జరగకపోవడంతో వీటిపై అధికారులు దృష్టి సారించలేకపోయారని చెబుతున్నారు. లోకోపైలట్ల నుంచి ప్రతీ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వదిలేయడమే ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఎంఎంటీఎస్​లో సమస్యలు కోకొల్లలు...

  1. జిల్లాల్లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌, ఇతర ప్రతి రైలులో లోకోపైలట్‌, సహాయ లోకోపైలట్‌ ఉంటారు. లోకోపైలట్‌ రైలును నడిపితే సహాయంగా ఉన్న వారు సిగ్నల్స్‌ను చూడటంతోపాటు ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో హెచ్చరిస్తుంటారు. ఎంఎంటీఎస్‌లో ఒక్కరే లోకోపైలట్‌ అన్నీ చూసుకోవాలి.
  2. ఎంఎంటీఎస్‌ రైళ్లలోనూ సహా లోకోపైలట్‌ను నియమిస్తే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
  3. దక్షిణ మధ్య రైల్వేలో లోకోపైలట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం ఎంఎంటీఎస్‌పై పడుతోందని చెబుతున్నా అధికారులు అంగీకరించడంలేదు. 52మంది లోకోపైలట్లను దీనికోసమే నియమించామని చెబుతున్నారు.
  4. రైలు ఎక్కే ముందు లోకోపైలట్‌కు బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించాలి. ఇది పూర్తిగా జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందేహాలున్నాయని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు.
  5. లోకోపైలట్లను ఆకస్మికంగా లోకోఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేయాలి. పూర్తిస్థాయిలో ఈ తనిఖీలు జరగడం లేదని చెబుతున్నారు. లోకోపైలట్లకు పునశ్చరణ తరగతులు సైతం తూతూమంత్రంగానే జరుగుతున్నట్లు సమాచారం.
  6. నగరంలో ఎంఎంటీఎస్‌ నడుస్తున్న 45 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌లో 6 చోట్ల రైళ్లు క్రాస్‌ అయ్యే పరిస్థితులున్నాయి. ఈ ఆరు చోట్ల సిగ్నల్స్‌ను ఉద్యోగులే చేపడుతున్నారు.
  7. ఈ సిగ్నళ్ల వద్ద లోకోపైలట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో పైలట్ల పట్ల కఠినంగా వ్యవహరించేలా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సికింద్రాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి, ఫలక్‌నుమా, హఫీజ్‌పేట, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లలో రైల్వే లైన్లు క్రాస్‌ అవుతాయి. ఈ ప్రాంతాల్లో ఇంకా మాన్యువల్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ కొనసాగుతోంది. కొన్ని స్టేషన్ల దగ్గర 4 లైన్ల పట్టాలు.. మరికొన్ని చోట్ల 5, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో 10 లైన్ల పట్టాలుంటాయి. వీటికి తోడు యార్డులకు వెళ్లే లైన్లూ ఉంటాయి. ఈ ఆరు చోట్ల బయట నుంచి వచ్చే రైళ్లను స్టేషన్లోని వివిధ ప్లాట్‌ఫారాలకు మార్చాల్సి ఉండడంతో రైల్వే లైన్ల క్రాసింగ్‌ ఉంటుంది. ఇక్కడి సిబ్బంది అప్రమత్తతే ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. కాచిగూడ ఘటన నేపథ్యంలో ఇక్కడ అప్రమత్తం చేస్తేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details