ప్రజా తీర్పుతో మంత్రులు, సలహాదారులు మతిభ్రమించి నోరు పారేసుకుంటున్నారని ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు. తెదేపా మద్దతుదార్లకు వచ్చిన ఓట్ల శాతం చూసి మంత్రి బొత్సకి కళ్లు బైర్లు కమ్మాయన్నారు. అర్ధరాత్రి 94 శాతం గెలిచామని తెల్లారే సరికి తూచ్ 82 అంటూ మాట మార్చారని ఆరోపించారు. విజయనగరంలో ఎన్నికలు నిర్వహిస్తే మంత్రి బొత్స బలమెంతో బయటపడుతుందన్నారు. బులుగు మీడియా తప్పుడు లెక్కలు చదివి.. అంతా గెలిచేశామని చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. "ఉత్తరాంధ్ర సామంత రాజు ఏ2 విజయసాయిరెడ్డి ఓటమిని ఒప్పుకొని ట్వీట్లు పెడుతుంటే.. మంత్రులేమో ప్రజలను మోసం చేసేందుకు తప్పుడు లెక్కలు చదువుతున్నారన్నారు" అంటూ మండిపడ్డారు. వైకాపా అసమర్థ పాలనకు ప్రజల చీత్కారం మొదలయ్యిందని దుయ్యబట్టారు.
పోస్కో డీల్ బయటపడకుండా ఆగదు:
కారాగారం అంటూ మైక్ ముందు ఎన్ని కబుర్లు చెప్పినా పోస్కో కంపెనీతో సీఎం జగన్ చేసుకున్న డీల్ బయటపడకుండా ఆగదని.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం ప్లానింగ్ అంతా మీ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్వయంగా రాజ్యసభ సాక్షిగా బయటపెట్టారని విమర్శించారు. ఉక్కు కర్మాగారం భూముల్లో పోస్కో కంపెనీ ఏర్పాటు, ఆర్ఐఎన్ఎల్-పోస్కో ఒప్పందం, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, తర్వాత సీఎం జగన్ను కలిసి డీల్ ఓకే చేసుకోవడం.. అన్ని విషయాలు ఆన్ రికార్డ్ బయటపడి అడ్డంగా దొరికిపోయారన్నారు. స్టీల్ ప్లాంట్ ముందు ఇక వైకాపా డ్రామాలు ఆపి ప్రజల్ని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలి అనుకుంటున్న మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని విజయ సాయిరెడ్డిపై ట్విట్టర్లో ధ్వజమెత్తారు.