కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ.... ఎంతో మందికి పూటగడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలైతే.. మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డలకు ఆశాదీపంగా.... వారి ఆకలి తీర్చే దిశగా నిరంతరం పరితపిస్తున్నారు.... తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క.
లాక్‌డౌన్ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి.... ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా.... కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ.... నిత్యావసర సరకులను అందిస్తున్నారామె. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడేల్లో పర్యటిస్తూ... ప్రజల్లో భరోసా నింపుతున్నారు.
ఇప్పటివరకు 320 గ్రామాల్లో పర్యటన
ములుగు నియోజకవర్గంలో 700కు పైగా పల్లెలుండగా.... ఇప్పటి వరకు 320 గ్రామాల్లో పర్యటించిన సీతక్క... అందరికీ నిత్యావసర సరకులు అందజేశారు. ఆదివాసీలకు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పుదినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా పంపిణీ చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో పంపిస్తున్నారు. అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి ప్రజలకు అందిస్తున్నారు.