ఈ మధ్యకాలంలో బుల్లెట్ బండి పాట (bullet bandi song) ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఓ పెళ్లి వేడుకలో కాబోయేవాడిని మెప్పించడానికి వధువు వేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఏ ఫంక్షన్లో చూసిన బుల్లెట్ బండి పాట లేదంటే అది ఫంక్షన్ కాదేమో అన్నంతగా అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్ బండి పాట లేనిదే వేడుక లేదు. మాట తిరిగిన చిన్నారి మొదలు పండు ముసలి వరకు నాలుకపై బుల్లెట్ పరుగులు పెడుతూనే ఉంది.
పెళ్లి వేడుకలు, ఆస్పత్రులు, ఇతర ఫంక్షన్లలో బుల్లెట్ బండిపాటకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే... వెంటనే అందరికీ వచ్చే అనుమానం బుల్లెట్ బండిపాటే అని.. మరి అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు. తాజాగా ఈ పాటకు తన డ్యాన్స్‌ను జతచేశారు తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజయ్య.. స్థానికంగా ఉన్న చిన్నారులతో కలిసి స్టేజిపైనే బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. సాక్ష్యాత్తు ఎమ్మెల్యే తమతో డ్యాన్స్ చేస్తుండడంతో ఆనందంతో పిల్లలు కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు.