తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క సారక్క జాతర ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన శిలాఫలకం మరోసారి వివాదాస్పదమైంది. అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ నూతనపాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా.. జాతర రహదారికి అడ్డంగా ఉన్న స్థూపాన్ని కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో.. అక్కడే ఉన్న తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు మోరే మహేందర్ శిలాఫలకాన్ని గునపంతో ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గతంలోనూ వివాదాస్పదం..
2010లో కొండా సురేఖ పరకాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత నిధులతో.. భూమి కొనుగోలు చేసి సమక్క సారక్క జాతర కోసం దానం ఇచ్చారు. ఈ స్థలం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తల్లిదండ్రుల పేరు మీద తీసుకోగా.. వారి జ్ఞాపకార్థంగా శిలాఫలకంతో స్థూపం నిర్మించారు. ఈ స్థూపాన్ని గతంలో కూడా ఓ సారి కూల్చేందుకు ప్రయత్నించగా.. వివాదాస్పదమైంది. మళ్లీ.. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం కాగా.. దీనిపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తెరాస నాయకులపై మండిపడ్డారు.