తెలంగాణలోని జనగామ పట్టణం నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధిచేసి యశ్వంతపూర్ వాగులోకి పంపేందుకు చేపట్టిన కాలువ నిర్మాణ పనులపై గ్రామ మాజీ సర్పంచ్ బొట్ల సుశీలతోపాటు పలువురు గ్రామస్థులు హైకోర్టుకు వెళ్లారు. వీరి అభ్యర్థనను విచారించిన న్యాయస్థానం కాలువ నిర్మాణంపై స్టే ఆర్డర్ ఇచ్చింది.
తెలంగాణ: నేలపై పడుకొని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నిరసన - mla muthireddy yadagiri reddy
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సహా గ్రామస్థులు.. కాలువ నిర్మాణ పనులపై స్టే ఆర్డర్ తీసుకురావడం వల్ల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా.. ఆయన పక్కనే కూర్చొని మాజీ సర్పంచ్ బొట్ల సుశీల ఆందోళన చేశారు.
జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామంలో చెక్‌డ్యాం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. కాలువ నిర్మాణంపై స్టే తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా.. నేలపై పడుకొని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోనికి మురికి నీరు రాదని, శుద్ధి చేసిన మంచి నీరే వస్తుందని, అందువల్ల కాలువ నిర్మాణాన్ని అడ్డుకోవద్దని గ్రామస్థులకు ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గ్రామంలోని వాగు నీటినే తాగునీరుగా వాడుతున్నామని, జనగామ నుంచి మురుగు నీరొస్తే వాగునీరు కలుషితమవుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువను పొడిగించి నీరు గ్రామం బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలోకి జనగామ నుంచి మురుగు నీరు వస్తే మాత్రం తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా.. గ్రామ మాజీ సర్పంచ్ బొట్ల సుశీల ఆయన పక్కనే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.