mirchi farmers loss: దేశంలో నాణ్యమైన మిరపకాయలు తెలుగు రాష్ట్రాల్లో పండుతాయి. ఈ పంటకు గతేడాది మంచి ధర పలకడంతో తెలంగాణలో ఈసారి పెద్దఎత్తున సాగుచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున కౌలుకు తీసుకున్నారు. ఇక సంకరజాతి (హైబ్రీడ్) మిరప విత్తనాలు కిలో రూ.50 వేలకు పైగా పలుకుతున్నాయి. ఒక్కో మొక్కను రూ.2 నుంచి 3లకు కొని నాటిన ఈ పంటను కాపాడుకోవడానికి రైతులు అందినకాడల్లా అప్పులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో మిరప వేశారని ఉద్యానశాఖ అంచనా. ఈ వర్షాలలో ఎక్కువ శాతం తోటలు ఎంతో కొంత దెబ్బతిన్నాయి. కొన్నితోటలు చూడ్డానికి పచ్చగా కనిపిస్తున్నా తామరపురుగు, వర్షాలతో పూత, కాత రాలిపోయి దిగుబడి వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు నుంచి డిసెంబరు దాకా తామరపురుగు సోకడంతో పైరును కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి రసాయన పురుగుమందులు చల్లారు. దీనినుంచి బయటపడేలోగానే ఈ నెలలో కురిసిన అకాల, భారీ వడగండ్ల వర్షాలు మిరపతోటలను తీవ్రంగా దెబ్బతీశాయి.
- రాష్ట్రంలో పంటల బీమా పథకం అమల్లో లేకపోవడంతో మిరప రైతులకు భరోసా కరవైంది. పథకం అమల్లో ఉంటే.. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో కచ్చితంగా పరిహారం వచ్చేదని రైతులు అంటున్నారు.
- కేంద్రం ఏటా 24 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నా వాటిలో మిరప లేదు. ఇది వాణిజ్య పంట అనే సాకుతో పక్కనపెట్టింది. వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తున్నందున ఈ పంటపై రైతులకు పూచీకత్తు కరవైంది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన అటవీ గ్రామాలైన వాజేడు మండలం చీకుపల్లి, నాగారంలో మిరప తోటలకు అపార నష్టం వాటిల్లింది.ఈ ఒక్క మండలంలోనే 1500 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా.
- రాష్ట్రం మొత్తమ్మీద 20 వేల ఎకరాల్లో మిరప తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ ప్రభుత్వానికిచ్చిన ప్రాథమిక అంచనాల నివేదికలో తెలిపింది. ఈ రైతులు పంట సాగుకు పెట్టిన రూ.200 కోట్ల పెట్టుబడి దాదాపు పోయిననట్టేనని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పంటనష్టంపై పూర్తిస్థాయిలో అంచనావేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
5 ఎకరాలకు రూ.5 లక్షల నష్టం
ఐదెకరాల్లో రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి మిరపతోట సాగుచేశా. వర్షాలు, తెగుళ్లకు పంటల చాలావరకు నాశనమైంది. దిగుబడి ఏమీ వచ్చే అవకాశం లేనందున పెట్టుబడి కూడా చేతికి రాదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకుంటేనే బయటపడగలం. -మేకల సంతోష్, రావులపల్లి, రేగొండ మండలం