ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి లేదు:కేంద్ర జలశక్తి శాఖ - పోలవరం ప్రాజెక్టు వార్తలు

Ministry of Jal Shakti
Ministry of Jal Shakti

By

Published : Jun 27, 2020, 10:32 AM IST

Updated : Jun 28, 2020, 4:09 AM IST

10:31 June 27

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవన్న కేంద్ర జలశక్తి శాఖ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను కేంద్ర జలశక్తి శాఖ తోసిపుచ్చింది.పోలవరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని.... నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టారని...కేంద్ర జలసంఘం, జల్‌ శక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేశాయి. కేంద్ర నిధులతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతి, నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపించాలని పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి 2019లో దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. పిటిషనలో పేర్కొన్న  అంశాలను తొలుత కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పిటిషనర్‌కు దిల్లీ హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు పిటిషన్‌లో పేర్కొన్న 19 అంశాలకు కేంద్ర జల్‌ శక్తిశాఖ సమాధానమిచ్చింది 

పోలవరం నిర్మాణానికి కేంద్రం 7వేల కోట్లు కేటాయిస్తే అది చంద్రబాబుకు ఏటీఎమ్​లా మారిపోయిందని..ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించారా అన్న ప్రశ్నను కేంద్ర జలసంఘం కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ మా కార్యాలయానికి రాలేదు కాబట్టి...దీనిపై సమాధానమివ్వడానికి ఏమీలేదని తెలిపింది. పోలవరం నిర్మాణంపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్య తీసుకున్నారన్న ప్రశ్నకు కేంద్ర జలసంఘం వివరణ ఇచ్చింది. ఆ నివేదికను పరిశీలించి జలశక్తి శాఖకు పంపామని తెలిపింది. నివేదికలోని అంశాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం..ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నిబంధనలపరంగా కానీ, కోడ్‌ పరంగా కానీ ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పిందని జల్‌ శక్తి శాఖ పేర్కొంది. అధీకృత సంస్థ అనుమతితోనే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. పనులు, ఎమ్ బుక్‌ రికార్డింగ్‌లో ఉల్లంఘనలు జరిగాయా అన్న అంశంపై ఏపీ విజిలెన్స్ విభాగం విచారణ చేస్తోందని...ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌తో 223.44 కోట్లు మిగులుతున్నాయంటూ గతేడాది నవంబర్ 13న ఏపీ ప్రభుత్వం లేఖ రాసినట్లు కేంద్ర జల్‌ శక్తిశాఖ వెల్లడించింది. తమ అనుమతితోనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం సవరించారు తప్ప...అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం 55 వేల 548.87 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసిందని...జలశక్తి సలహా సమితి సైతం అంగీకరించినట్లు గుర్తుచేసింది.

చట్టాలను తూచా తప్పకుండా పాటించారు...

పోలవరం ప్రాజెక్ట్ భూ పరిహారం విషయంలోనూ పలుకుబడి ఉన్న వారికే ఎక్కువ పరిహారం ఇచ్చారన్న  ఆరోపణను  సైతం జలశక్తిశాఖ కొట్టిపారేసింది. 1894 భూసేకరణ చట్టం, 2013 భూసేకరణ , సహాయ పునరావాస చట్టాలను తూచా తప్పకుండా పాటించారని...ఒకే అవార్డులో రైతులందరికీ ఒకే పరిహారం చెల్లించారని స్పష్టం చేసింది. ఒక రైతుకు ఎక్కువ, ఒక రైతుకు తక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపింది. 

 ఒప్పందం కన్నా తక్కువే చెల్లింపులు...

కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే పట్టిసీమ, పురుషోత్తపట్నం నిర్మించారని...పట్టిసీమలో గుత్తేదారుడికి 400 కోట్లు అధికంగా చెల్లించారన్న ఆరోపణకు సీడబ్ల్యూసీ సమాధానమిచ్చింది.  పోలవరం ఫలాలు రైతులకు ముందుగానే అందించాలన్న తలంపుతోనే పట్టిసీమ ప్రాజెక్ట్‌ చేపట్టారని...ఇందులో పోలవరం ఆయకట్టు మినహా కొత్తదేమీ లేదని..పర్యావరణ అనుమతుల సమస్యా లేదని స్పష్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా గ్రీన్ ట్రైబ్యూనల్ సైతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేసింది. పట్టిసీమకి  13 వందల కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా...ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా ఇద్దరు గుత్తేదారులు పాల్గొన్నారని తెలిపింది. ఇందులో మేఘా సంస్థ టెండర్‌ దక్కించుకోగా 14 వందల 27.70 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సవరించిన అంచనాలతో కలిపి ఆ సంస్థకు 14 వందల 25.90 కోట్లు చెల్లించారు.  అంటే ఒప్పందం కన్నా కోటీ 80 లక్షల రూపాయలు తక్కువే ఇచ్చారని  సీడబ్ల్యూసీ వివరించింది. గుత్తేదారుకు అధిక సొమ్ము చెల్లించారనడం అవాస్తవమని తేల్చిచెప్పిన  సీడబ్ల్యూసీ....ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. దీన్ని కేంద్ర జలశక్తిశాఖ కూడా సమర్థించింది.

ఇదీ చదవండి:

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

Last Updated : Jun 28, 2020, 4:09 AM IST

ABOUT THE AUTHOR

...view details