నీళ్లులేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడిపేందుకు కాళేశ్వర గంగ తరలివచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక్‌సాగర్‌లో గోదావరి జలసవ్వడి మొదలైంది. అన్నపూర్ణ జలాశయం నుంచి జలాలను రంగనాయకసాగర్‌లోకి విడుదల చేసేందుకు నాలుగు మోటార్లను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో గోదారమ్మకు జలహారతులు ఇచ్చారు.
పేరు ఇలా వచ్చింది
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేటలో నిర్మించిన రంగనాయక సాగర్ జిల్లాలోనే మొదటి ప్రాజెక్ట్. దీనికి సమీపంలో రంగనాయక స్వామి ఆలయం ఉండటం వల్ల.. ఆ స్వామి పేరు పెట్టారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు చేరనున్నాయి. సిద్దిపేట పట్టణానికి అతి సమీపంలో 2,300 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,300కోట్లు ఖర్చు చేసి రంగనాయక సాగర్ ప్రాజెక్టును పూర్తి చేశారు. 8 కిలోమీటర్ల 650మీటర్ల పోడవైన కట్టను ఇందుకోసం నిర్మించారు.