Ministers on Shivraj singh Chouhan: జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ నాయకులు ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ 14కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే భాజపా అడ్డుకుంటోదని హరీశ్‌రావు ఆరోపించారు. అవినీతిపై శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
నరహంతక చరిత్ర..
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ సాధించింది ఏమిటని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్య ప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని ఎద్దేవా చేశారు. రైతులను పిట్టల్లా కాల్చి చంపించిన నరహంతక చరిత్ర చౌహాన్‌ది అంటూ మంత్రి హరీశ్ మండిపడ్డారు. 2017లో మద్దతు ధర, రుణమాఫీ కోసం రైతులు ధర్నా చేస్తే.. మార్కెట్ యార్డులో పట్టపగలు ఆరుగురు రైతులను కాల్చి చంపారని ఆరోపించారు. వ్యాపం కుంభకోణంలో ఇంతవరకూ దోషులను తేల్చలేదన్న మంత్రి.. ఆ కేసులో ఎంతో మంది అదృశ్యమయ్యారని.. శివరాజ్, మంత్రులు, కుటుంబసభ్యులపై ఆరోపణలు వచ్చాయన్నారు.వ్యాపం కుంభకోణం కేసులో ఎవరికైనా శిక్ష పడిందా?.. సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్ ఏం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
విమర్శించే హక్కు కూడా లేదు..
‘‘శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చవాకులు పేలారు. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్ సింగ్ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నట్లు ఉంది. శివరాజ్‌సింగ్‌కు తెరాసను, కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొని శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది?మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి?.కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పింది. -హరీశ్ రావు, తెలంగాణ మంత్రి
కేసీఆర్ తలుచుకుంటే విమానం దిగగలిగే వారా?: గంగుల
కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విరుచుపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రులు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే శివరాజ్ సింగ్‌కు భయమంటే ఏమిటో చూపే వాళ్లమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ తలుచుకుంటే విమానం దిగగలిగే వారా అన్న గంగుల కమలాకర్... అతిథిగా భావించారు కాబట్టే సురక్షితంగా వెళ్లగలిగారని వ్యాఖ్యానించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన సరిగా లేకే మధ్యప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ వలస వస్తున్నారన్నారు. మరోసారి తెలంగాణకు వస్తే మధ్యప్రదేశ్ వలస కార్మికులే అడ్డుకుంటారని చౌహాన్‌ను గంగుల హెచ్చరించారు.