కృష్ణా జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు పరిహారంపై గతంలో ఎనాడు ఒక్కమాట మాట్లాడని పవన్...ఇవాళ మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమా జీవితంలోనే వకీల్ సాబ్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని..ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేవలం తన సినిమా ప్రమోషన్ల కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమాలు ఆపేయాలని తాము ఏనాడు అనలేదని స్పష్టం చేశారు.
నోరు అదుపులో పెట్టుకో: కొడాలి నాని
కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం గుడివాడ సెంటర్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పేకాట క్లబులు, రోడ్లు, రైతుల కష్టాలను ప్రధానంగా లెవనెత్తారు. పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేను విమర్శిస్తూ ప్రసంగించారు. జనసేనాని చేసిన పలు వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో జవాబిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేకాట క్లబ్బులను మూయిస్తుందే తప్ప.. ప్రోత్సహించటం లేదన్నారు. మంత్రిగా, రాష్ట్ర ప్రజలకు.. ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్తానే తప్ప.. ఎవరో చేసిన ఆరోపణలు పట్టించుకోనని అన్నారు. ఎవరో ప్యాకేజీలిస్తే పర్యటనలు చేయడం కాదని దుయ్యబట్టారు. నోరు అదుపులో ఉంచుకోవాలని తమకు చెప్పటం కాదని...అతనే నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
నకిలీ వకీల్ సాబ్.. మోదీ సాబ్‌కి చెప్పు: పేర్నినాని
పవన్ కల్యాణ్‌పై మరో మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంపై మాట్లాడుతున్న పవన్ ముందుగా... మోదీ సాబ్తో మాట్లాడి కౌలు రైతులందరికీ రైతు భరోసా ఇప్పించేలా చూడాలని సూచించారు. పరిహారం పెంచాలని గత ప్రభుత్వంలో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ రెడ్డి ప్రభుత్వమే డబ్బులు కట్టిందనే సంగతి పవన్ తెలుసుకోవాలన్నారు. సినిమాలు ఆపేయాలని పవన్ కల్యాణ్‌ను తాము కోరలేదని స్పష్టం చేశారు.