రాష్ట్రంలో ఇసుకలభ్యత పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టాల్సిందిగా మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఇవాళ మరోమారు సమావేశమైంది. భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఈ సమావేశానికి హాజరయ్యారు. అటు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై మంత్రుల కమిటీకి ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిందిగా మంత్రుల కమిటీ గనుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని మరింత మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా మంత్రులు చర్చించారు. బ్లాక్ మార్కెట్‌లో ఇసుక విక్రయాలు నిలువరించటంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఇసుక రీచ్‌ల్లో కార్యకలాపాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఇసుక లభ్యతపై వినియోగదారులకు సమాచారం అందేలా చూడాలని సూచనలు ఇచ్చారు.