ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరం సవరించిన అంచనాలే ఆమోదించండి' - దిల్లీలో బుగ్గన అనిల్ కుమార్ పర్యటన

పోలవరం తాజా డీపీఆర్​పై కేంద్ర జలసంఘం పరిశీలన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ అన్నారు. దిల్లీలో శుక్రవారం కేంద్రమంత్రితో భేటీ అయిన రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో నిర్మించాలంటే సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. ప్రాజెక్టులో తాగునీటి ఖర్చు మొత్తాన్ని కూడా ఇవ్వాలని కోరారు.

ministers
ministers

By

Published : Dec 11, 2020, 11:21 AM IST

Updated : Dec 12, 2020, 6:33 AM IST


పోలవరానికి సంబంధించి తాజా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చారు. 2017-18 నాటి సవరించిన అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేయాలన్న సిఫార్సును సీడబ్ల్యూసీ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. దిల్లీలో శుక్రవారం కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు సకాలంలో నిర్మించాలంటే సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాల్సిన అవసరాన్ని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రికి విన్నవించారు. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టులో తాగునీటి వాటా ఖర్చుకు మినహాయించిన మొత్తాన్ని కూడా ఇవ్వాలని కోరారు.

15 రోజుల్లో కేంద్ర మంత్రి వస్తామన్నారు
ఈ భేటీ తర్వాత మంత్రి బుగ్గన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందునే పోలవరానికి వాస్తవంగా రావాల్సిన నిధులు రాలేదని, తాము అప్పటి చిక్కుముళ్లను ఒక్కోటి విప్పుతూ వస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును సీఎం ప్రాధాన్యాంశంగా తీసుకున్నారని, సకాలంలోనే పనులు పూర్తవుతాయన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పంపించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశామన్నారు. ‘2017లో జరిగిన పొరపాటును మేం కేంద్రమంత్రికి వివరించాం. నిర్మాణం, సహాయ, పునరావాస పనుల పరిశీలనకు రావాలని షెకావత్‌ను ఆహ్వానించాం. 15 రోజుల్లోపే వస్తానని హామీ ఇచ్చార’ని అనిల్‌ తెలిపారు.

సీడబ్ల్యూసీ పరిశీలన కీలకం
‘ప్రాజెక్టుపై నిబంధనలు, చట్టం ప్రకారం ఎలా ముందుకెళ్లాలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం.. కేంద్ర జల సంఘానికి సూచించింది. సవరించిన అంచనాల ప్రకారం అనుమతులు ఇచ్చేలా సాంకేతిక సలహా కమిటీని ఒప్పించే బాధ్యత కూడా సీడబ్ల్యూసీదే. పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలోనూ సవరించిన ధరల మేరకు నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ప్రతినిధులు అనుకూలంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా జాతీయ ప్రాజెక్టులన్నింటికీ ఇదే విధానం అమలవుతోంది. తాజా ధరల ప్రకారమే నిధులు ఇస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం చూసినా.. ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ విషయాన్నే కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించామ’ని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చిన వెంటనే పరిశీలించి తాము ఆర్థిక శాఖకు పంపుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఆ నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్టుపై ఇప్పటిదాకా చేసిన ఖర్చుకు అర్థం లేదని, పునరావాస ప్రక్రియ పూర్తిచేస్తే తప్ప పూర్తిస్థాయిలో నీటి నిల్వకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.

14న పోలవరానికి ముఖ్యమంత్రి జగన్‌
ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు డిసెంబర్‌ 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలవరానికి వెళ్లనున్నారు. ఆ రోజు స్వయంగా పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం

Last Updated : Dec 12, 2020, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details