రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
నెల్లూరు జిల్లా...
నెల్లూరు నగరంలో ఏసీ కూరగాయల మార్కెట్ ను మూసేసి, కార్పొరేషన్ పరిధిలో 110 కూరగాయల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అమలవుతున్న లాక్ డౌన్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.
చిత్తూరు జిల్లా...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. కరోనా వైరస్ నివారణకు ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కరోనా వైరస్ ప్రభావం పై జిల్లా అధికారులతో సమీక్షించారు.
శ్రీకాకుళం జిల్లా...
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రభుత్వ సూచనలు ప్రజలు పాటించాలని కోరారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రస్తుతం కోవిడ్-19కు మందు లేదని... వైరస్ వ్యాప్తిని నిరోధించటమే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.